- ఏపీ ప్రభుత్వం నిర్ణయం
అమరావతి: కరోనా పేషంట్ల ప్లాస్మా థెరపీ ట్రీట్‌మెంట్‌కు ప్లాస్మా దానం చేసే వారికి రూ.5000 ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో కరోనా కట్టడి, ఆస్పత్రుల్లో వైద్యం, విద్యావ్యవస్థలో నాడు నేడు కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్లాస్మా దానంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. “కరోనాపై అవగాహన కల్పించడానికి విస్తృతంగా ప్రచారం చేయాలి. అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలి’’ అని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకని పరిస్థితి ఉండకూడదని సీఎం చెప్పారు. ఆస్పత్రుల్లో భర్తీ వివరాలు ఆస్పత్రి హెల్ప్ డెస్క్‌లో అందుబాటులో ఉంచాలని, ఎవరికైనా బెడ్ అందుబాటులోకి లేదంటే సమీపంలోని ఆస్పత్రిలో బెడ్ అలాట్ చేసి అక్కడ నుంచే ట్రీట్‌మెంట్ జరిగేలా ఏర్పాటు చేయాలని చెప్పారు. హెల్ప్ డెస్క్‌లో ఉన్నవారికి ఓరియంటేషన్ బాగుండాలని సూచించారు. అధికారులు సూక్ష్మస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, బెడ్లు, వైద్యం, ఆహారం , పరిశుభ్రత బాగుందా లేదా అనే దానిపై కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జీజీహెచ్ లాంటి ఆస్పత్రులపై మరింత శ్రద్ధపెట్టాలి అని చెప్పారు. ఆస్పత్రులపై దృష్టి సారించేలా జేసీలకు బాధ్యత ఇవ్వాలని అన్నారు. కరోనా లాంటి విపత్తులను భవిష్యత్తులో ఎదుర్కోవాలంటే.. మూడేళ్లలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి కావాలని సీఎం అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌తో ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రోడ్డు ట్యాక్స్ చెల్లింపు గడువు పెంచుతూ ప్రభుత్వం సాయంత్రం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనున్నది. సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, అధికారులు నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, హెల్త్ స్పెషల్ సీఎస్ జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
