టార్చర్ ద పీపుల్.. బయ్ ద పీపుల్.. డెమోక్రసీకి నారాయణమూర్తి నిర్వచనం

టార్చర్ ద పీపుల్.. బయ్ ద పీపుల్.. డెమోక్రసీకి నారాయణమూర్తి నిర్వచనం

అబ్రహమ్ లింకన్ చెప్పిన ప్రజాస్వామ్యం నిర్వచనం మారిపోయిందన్నారు  సినీ నిర్మాత, దర్శకుడు,  ఆర్.నారాయణమూర్తి. ఫర్ ద పీపుల్.. ఫార్ ద పీపుల్ అయ్యిందనీ.. టు ద పీపుల్ పోయి టార్చర్ ద పీపుల్ అయిందనీ..  బై ద పీపుల్ స్థానంలో.. బైయింగ్ ద పీపుల్ వచ్చిచేరిందని అన్నారు.

ఈ పరిస్థితి మారాలంటే.. నిజమైన ప్రజాస్వామ్యం కావాలంటే.. 90 శాతం పేదల్లో నుండి వచ్చిన వారే ఎమ్మెల్యేలు.. ఎంపీలుగా గెలిచే పరిస్థితి రావాలన్నారు. పేదలు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచిన రోజే నిజమైన ప్రజాస్వామ్యం వచ్చినట్లు అని నారాయణ మూర్తి చెప్పారు.

మార్కెట్లో ప్రజాస్వామ్యం సినిమా ప్రమోషన్లో భాగంగా కర్నూలు వచ్చిన నారాయణమూర్తి బీసీ భవన్ లో స్థానిక నాయకులతో సమావేశం అయ్యారు.

జులైలో విడుదల చేసినప్పుడు అనేక పెద్ద సినిమాల మధ్యలో సినిమా నలిగిపోవడం వల్ల వెనక్కి తీసుకున్నానని.. అయితే అనేక మంది మిత్రులు.. ప్రజాస్వామ్య ప్రియుల కోరిక మేరకు నవంబర్15న మళ్లీ విడుదల చేస్తున్నానన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కావాలంటే 100 కోట్లు.. ఎంపీ కావాలంటే 200 కోట్లు ఖర్చు చేస్తున్నారు.. డబ్బు పెట్టి గెలిచిన వారు ప్రజాప్రతినిధులైతే.. ప్రజలకు ఏం సేవ చేస్తారని నారాయణ మూర్తి ప్రశ్నించారు. ఖర్చు పెట్టిన దాన్ని రెండింతలు సంపాదించుకోవాలని చూస్తారని అన్నారు. ప్రజాస్వామ్యం.. ధనస్వామ్యం.. వ్యాపారస్వామ్యం అయిపోతోందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాతోపాటు.. రాయలసీమ ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కోసం చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని చెప్పారు.