పార్లమెంట్​లో బీసీ బిల్లు పెట్టాలి...ఆర్.కృష్ణయ్య డిమాండ్

యాదాద్రి, వెలుగు: దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టడంతో పాటు పార్లమెంట్​లో బీసీ బిల్లు పెట్టాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్  చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. 56 శాతం ఉన్న బీసీలకు ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని,  లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. అభివృద్ధి చెందిన కులాలకు ఈబీసీ పేరుతో 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన, అదే తరహాలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు.

రిజర్వేషన్లకు 50 శాతం సీలింగ్​ అని చెబుతూ తప్పించుకుంటున్నారని విమర్శించారు. బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా గొర్రెలు, బర్రెలు, పందులు ఇస్తూ శాశ్వతంగా బిచ్చగాళ్లుగా మారుస్తున్నారన్నారు. బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా మార్చుకొని, పాలన దక్కకుండా కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్  తరహాలో, బీసీలకు కూడా బీసీ అట్రాసిటీ యాక్ట్​ తేవాలని డిమాండ్​ చేశారు. మీటింగ్​లో పల్లగొర్ర మోదీ రాందేవ్, గుజ్జ కృష్ణ, వేముల రామకృష్ణ, నందగోపాల్, ఉదయ్, జయంతి, రవి యాదవ్, పుట్టా వీరేశ్, గుండెబోయిన సురేశ్, వంశీ, జంగయ్య, బాలస్వామి, బాలయ్య ఉన్నారు.