పుష్ప2 ప్రీమియర్ షో దెబ్బ: సీఎంతో మీటింగ్కు బడా నిర్మాతల తహతహ.. సంక్రాంతి సినిమాల బెన్ఫిట్ షో కోసమేనా ?

పుష్ప 2 తొక్కిసలాట ఘటన నేపధ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల స్పెషల్ షోలకు అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటన 2025 సంక్రాంతికి వచ్చే సినిమాలపై భారీ ఎఫెక్ట్ పడనుందని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. టిక్కెట్ల పెంపుదల మరియు స్పెషల్ షోలకి ప్రభుత్వం నుంచి అనుమతి రానుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. 

ఇవాళ (డిసెంబర్ 23న) నిర్మాత నాగవంశీ డాకు మహారాజ్ ప్రమోషన్స్ నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టారు. బెనెఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం గురించి ఆయనకు ఈ సందర్భంగా ప్రశ్న ఎదురైంది. దీంతో సంక్రాంతి సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ అవసరం లేదని నాగవంశీ చెప్పారు. 

"ప్రస్తుతం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్ (TFDC) ప్రెసిడెంట్ దిల్ రాజు యుఎస్‌లో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాతనే టికెట్ల పెంపు అంశంపై చర్చిస్తామని నాగవంశీ అన్నారు. అంతేకాకుండా త్వరలో తెలుగు సినీ ప్రముఖులు అందరు కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసే ఆలోచనలో ఉన్నామని నిర్మాత నాగవంశీ తెలిపారు.

అలాగే దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10న వస్తుంది. మా డాకు మహారాజ్ కి 2 రోజుల ముందే.. గేమ్ ఛేంజర్ వస్తుంది కాబట్టి.. వారు కూడా టిక్కెట్ల పెంపు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. త్వరలో టిక్కెట్ల పెంపు, స్పెషల్ షోల విషయంపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని నాగ వంశీ చెప్పారు. ఇక సంక్రాంతికి రిలీజ్ కానున్న సినిమాలకి పెయిడ్ ప్రీమియర్స్ అవసరం లేదని.. తెల్లవారుజామున 4:30 గంటలకి సినిమా థియేటర్లో పడితే చాలు" అంటూ నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు.

ALSO READ : టాలీవుడ్ ఏపీకి వెళ్తుందా..? అగ్ర నిర్మాత నాగవంశీ ఆన్సర్ ఇదే

మరి ఈ విషయంపై దిల్ రాజు టాలీవుడ్ బడా నిర్మాతగా ఆలోచిస్తాడా? గవర్నమెంట్ నియమించిన చైర్మన్ గా నిర్ణయం తీసుకుంటాడా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న థియేటర్స్ లోకి రానుంది. అలాగే వెంకటేష్ నటించిన సంక్రాంతి వస్తున్నాం మూవీ జనవరి 14 న రిలీజ్ కానుంది.