- తొక్కిసలాట, మహిళ మృతి ఘటనలో ఏ2గా నమోదు
- ఏ1గా సంధ్య టాకీస్ యాజమాన్యం
- థియేటర్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం
- పుష్ప 2 షోకు అల్లు అర్జున్ వస్తున్నట్లు వాళ్లు చెప్పలే
- సెక్యూరిటీ మేనేజర్‌పైనా కేసు నమోదు చేశాం: డీసీపీ
- బెనిఫిట్ షోలు వద్దంటూ విద్యార్థి సంఘాల నిరసన
- మృతురాలు రేవతి ఫ్యామిలీని ఆదుకోవాలని డిమాండ్
- రేవతి కొడుకు శ్రీతేజ్ పరిస్థితి విషమం..72 గంటలు గడిస్తే తప్ప ఏం చెప్పలేమన్న డాక్టర్లు
ముషీరాబాద్, వెలుగు: సినీ నటుడు అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. తొక్కిసలాట, ఓ మహిళ మృతి ఘటనలో ఆయనను పోలీసులు ఏ2గా చేర్చారు. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని ఏ1గా చేర్చారు. పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ లోని సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చారు. దీంతో ఆయనను చూసేందుకు జనం ఎగబడటంతో తొక్కిసలాట జరిగి ముసురాంబాగ్కు చెందిన రేవతి చనిపోయింది. ఆమె 11 ఏండ్ల కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రస్తుతం ఆ బాబు ఆరోగ్యం విషమంగా ఉంది. ఘటనపై గురువారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో మీడియాకు సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ వివరాలు వెల్లడించారు. అల్లు అర్జున్, థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజర్‌పై కేసు రిజిస్టర్ చేసినట్లు చెప్పారు. ‘‘సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యమే తొక్కిసలాటకు ప్రధాన కారణం. అల్లు అర్జున్ వస్తాడన్న సమాచారం పోలీసులకు ఇవ్వలేదు. తోపులాట జరగకుండా చూడటంలో యాజమాన్యం విఫలమైంది.
అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్లేందుకు అనువుగా ఏర్పాట్లు కూడా చేయలేదు. దీంతో అతన్ని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అల్లు అర్జున్‌తో కలిసి థియేటర్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. లోపల ఉన్నోళ్లు బయటికొచ్చేందుకు ట్రై చేయడంతో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ హెల్త్ కండీషన్ సీరియస్‌గా ఉన్నది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశాం’’అని డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్
రేవతి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ డిమాండ్ చేశారు. గురువారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్, సంధ్య థియేటర్ యాజమాన్యాలపై కేసులు నమోదు చేయాలని కోరారు. బాధిత కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇంత జరిగినా అల్లు అర్జున్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. అదేవిధంగా అడ్వొకేట్ యమునా గౌడ్ తో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్ చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు పర్మిషన్లు ఇవ్వొద్దు: విద్యార్థి సంఘాలు
బెనిఫిట్ షోలు రద్దు చేయాలని, మృతురాలు రేవతి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. గాయపడిన శ్రీతేజ్‌కు మెరుగైన చికిత్స అందించాలని కోరింది. సంధ్య థియేటర్ ముందు గురువారం విద్యార్థి సంఘాల నేతలు ధర్నా చేశారు. బెనిఫిట్ షోల పేరుతో అభిమానుల మధ్యలోకి సెలబ్రిటీలు వస్తామని చెప్తే పోలీసులు అనుమతులు ఇవ్వొదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మూర్తి, నాగరాజు, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ డిమాండ్ చేశారు.
అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగి రేవతి చనిపోయిందన్నారు. ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. అల్లు అర్జున్‌పై సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కనీస ఏర్పాట్లు చేయని థియేటర్ మేనేజ్మెంట్పై క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయాలన్నారు.