సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి విషమం

  • రెండు వారాల వరకుఏం చెప్పలేమన్న డాక్టర్లు 
  • శ్రీతేజ్‌‌‌‌‌‌‌‌ను పరామర్శించిన మహిళా కమిషన్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ 

సికింద్రాబాద్, వెలుగు: పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్బంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. రెండు వారాలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని డాక్టర్లు చెబుతున్నారు. శ్రీతేజ్‌‌‌‌‌‌‌‌ ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్‌‌‌‌‌‌‌‌లో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇప్పటి వరకు అల్లు అర్జున్ తన కొడుకును చూసేందుకు రాలేదని, అయితే, హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ బిల్లులు మాత్రం కడుతున్నారని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తెలిపారు. కాగా, శ్రీతేజ్‌‌‌‌‌‌‌‌ను ఆదివారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నెరేళ్ల శారద, రాష్ట్ర మహిళా కో ఆపరేటివ్‌‌‌‌‌‌‌‌ డెవల్‌‌‌‌‌‌‌‌పమెంట్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్ బండ్రు శోభారాణి పరామర్శించారు. అనంతరం శారద మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో బాబును చూడటానికి వచ్చామని, ప్రభుత్వ సాయం కోరితే తప్పకుండా చేస్తామని తెలిపారు. బండ్రు శోభారాణి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు రాగానే పరామర్శించేందుకు సినీ ప్రముఖులంతా ఆయన ఇంటికి క్యూ కట్టారని, ఆయనేం ఘనకార్యం చేశాడని ప్రశ్నించారు. అదే క్యూ కిమ్స్ దవాఖానకు ఎందుకు ఉండడం లేదని నిలదీశారు. 

రూ.కోటి ఇవ్వాలి: మందకృష్ణ

శ్రీతేజ్ కుటుంబానికి అల్లు అర్జున్ రూ.కోటి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కిమ్స్‌‌‌‌‌‌‌‌లో శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ ఘటనలో బాధ్యులెవరైనా సరే చర్యలు తీసుకోవాలని మందకృష్ణ డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు.