తిండిలో మాంసాహారం, శాకాహారం ఉన్నాయి. మరి, నీళ్ల మాటేంటి? ఎహె, ఊరుకోండి నీళ్లలోనూ వెజిటేరియన్, నాన్వెజిటేరియన్ ఉంటాయా ఏంటి? అంటారా? ఈ యాడ్ తీరు అలాగే ఉంది మరి. ఓ వాటర్ ప్యూరిఫయర్ ఇచ్చిన ఆ యాడ్ ఇప్పుడు జనాన్ని ఆశ్చర్యపరిచింది. తమ ప్యూరిఫయర్లు ప్యూర్ అండ్ వెజిటేరియన్ వాటర్ ఇస్తుందని ఆ కంపెనీ యాడ్ ఇచ్చింది. ‘ప్యూర్ వెజిటేరియన్ వాటర్? అడ్వర్టైజింగ్ జిమ్మిక్కా!’ అంటూ స్టార్ట్ అయ్యి అసలు విషయంలోకి తీసుకెళుతుంది కంపెనీ. కానే కాదంటూ వెజిటేరియన్ వాటర్ ఎలాగో వివరించే ప్రయత్నం చేసింది.
‘‘మార్కెట్లో ఎన్నో రకాల ప్యూరిఫయర్లున్నాయి. అవి నీళ్లలో ఉన్న క్రిములను చంపేస్తున్నాయి. కానీ, చచ్చిపోయిన ఆ క్రిములు నీళ్లలో అలాగే ఉండిపోతున్నాయి. అంటే అవి నాన్వెజిటేరియన్ నీళ్లే కదా. కానీ, మా ప్యూరిఫయర్ మాత్రం నీళ్ల నుంచి ఆ చచ్చిపోయిన క్రిములను కూడా తొలగించేస్తుంది. కాబట్టి, స్వచ్ఛమైన వెజిటేరియన్ నీళ్లనిస్తాయి” అంటూ ప్రకటనలో రాసుకొచ్చింది. అయితే, ఆ యాడ్ కాస్తా ట్విట్టర్లో వైరల్ అయింది. నెటిజన్లు ఆ ఫొటోను పోస్ట్ చేసి చాలా మంది ఫన్నీ కామెంట్లు చేశారు. కొందరైతే యాడ్‌ను తిట్టిపోశారు. నీళ్లలోనూ నాన్వెజిటేరియన్ ఉంటాయా, ఇలాంటోళ్లను జన్మలో మార్చలేమంటూ మండిపడ్డారు. బాగు చేయలేనంత చెడ్డగా మారిపోయింది దేశమంటూ మరికొందరు కామెంట్ చేశారు.
