రైతు చట్టాల్నివ్యతిరేకిస్తూ అన్నదాతలు చేస్తున్న ర్యాలీలో పాల్గొన్న ఓ లాయర్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు చట్టాల్ని వ్యతిరేకిస్తూ పంజాబ్ తిక్రీ బోర్డర్ సరిహద్దులో అన్నదాతలు కిలోమీటర్ల మేర తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ నిరసనకు పంజాబ్ ఫాజిల్కా జిల్లాకు చెందిన లాయర్ అమర్ జిత్ సింగ్ మద్దతు పలికారు. తన నిరసనతో రైతులకు మద్దతు పలికిన అమర్ జిత్ సింగ్ అక్కడే తన వెంట తెచ్చుకున్న పాయిజన్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన రైతులు.., అమర్ జిత్ సింగ్ ను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కానీ ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే లాయర్ ప్రాణాలు కోల్పోయాడని రోహ్ తక్ వైద్యులు తెలిపారు.
మరోవైపు ఆత్మహత్యకు ముందు లాయర్ అమర్ జిత్ సింగ్ సూసైడ్ లెటర్ రాశారు. కేంద్రంప్రవేశ పెట్టిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులకు మద్దతు పలుకుతూ తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లెటర్ లో పేర్కొన్నారు. రైతులతో పాటు కూలీల్ని మోసం చేసేలా ఈ చట్టాలు ఉన్నాయని అన్నారు. రైతుల జీవితాల్లో చీకట్లను నింపుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు బాధితుడు డిసెంబర్ 18న ఈ సూసైడ్ లేఖ రాశారని, మరణంపై కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు స్థానిక పోలీసులు తెలిపారని పీటీఐ తన కథనంలో స్పష్టం చేసింది.
