నిజంగా షాకింగ్: బేకరీలో QR పేమెంట్ చేస్తే.. పోలీస్ దగ్గర 2 లక్షలు కొట్టేశారు..!

రోజురోజుకు ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. రకరకాల పేర్లతో అమాయకులను మభ్యపెడుతున్న సైబర్‌ మోసగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు. పోలీసులు, అధికారులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. పత్రికలు, టీవీల్లో ప్రతిరోజూ కథనాలు వస్తున్నా మోసపోయే వాళ్లు పోతూనే ఉన్నారు. తాజాగా, ఓ పోలీస్ అధికారినే నేరగాళ్లు బురిడీ కొట్టించారు. 

పూణేకు చెందిన ఒక పోలీసు కానిస్టేబుల్ సైబర్ మోసానికి బలయ్యాడు. క్యూఆర్ కోడ్‌ స్కామ్‌లో కూరుకుపోయి రూ. 2 లక్షల 30వేలు పోగొట్టుకున్నాడు. బాధితుడు సాస్వాద్‌లోని ఒక బేకరీలో అవసరమైన వస్తువులు కొనుగోలు చేసి.. బిల్లు చెల్లించడానికి ప్రయత్నించినప్పుడు ఈ ఘటన జరిగింది. కానిస్టేబుల్ బిల్లు చెల్లించే ప్రయత్నంలో క్యూఆర్ కోడ్‌ స్కాన్ చేసి UPI PIN ఎంటర్ చేయగానే అతని సేవింగ్స్ ఖాతా నుండి రూ.18,755 కట్ అయ్యాయి. అనధికార లావాదేవీతో అప్రమత్తమైన బాధితుడు.. తనకు సంబంధించిన ఇతర బ్యాంకు ఖాతాలను తనిఖీ చేయగా వాటిల్లో ఉన్న డబ్బును కొట్టేశారు.

ALSO READ | రేణుకాస్వామి హత్య కేసులో.. ఈ లవర్స్ ఇద్దరికి బెయిల్ వచ్చింది..!

ఈ ఘటనపై బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. APK ఫైల్ ద్వారా కానిస్టేబుల్ మొబైల్ ఫోన్, బ్యాంక్ ఖాతాలను సైబర్ నేరస్థులు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మోసగాళ్లు పంపిన హానికరమైన లింక్‌ను కానిస్టేబుల్ తనకు తెలియకుండానే క్లిక్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఏదేని APK ఫైల్‌ డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేయకుండా ఉండటమే ఉత్తమమని చెప్తున్నారు. అనధికారిక లేదా అనుమానాస్పద స్థానాల్లో QR కోడ్‌ పేమెంట్లు చేయకుండా నగదు చెల్లింపూలు చేయమని సలహా ఇస్తున్నారు.