పూణె: కస్టమర్లను ఆకర్షించడానికి వ్యాపారులు కొత్త ఐడియాలతో ముందుకొస్తుంటారు. బై వన్ గెట్ వన్ లాంటి ఆఫర్లను చూస్తూనే ఉంటాం. ఇక కరోనా వల్ల రెస్టారెంట్స్, హోటల్స్ బిజినెస్ పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ రెస్టారెంట్ యాజమాన్యం కస్టమర్లకు వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. 4 కిలోల స్పెషల్ థాలీని తింటే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను ఉచితంగా ఇస్తామంటూ కస్టమర్లను ఊరిస్తోంది. మహారాష్ట్రలోని పూణె శివార్లలో ఉన్న సదరు రెస్టారెంట్ పేరు శివరాజ్ హోటల్. దాదాపు నాలుగు కిలోల బరువు ఉండే నాన్ వెజ్ థాలీని 60 నిమిషాల్లో తినడం పూర్తి చేస్తే 1.65 లక్షల ఖరీదైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను ఉచితంగా ఇస్తామని కస్టమర్లకు శివరాజ్ హోటల్ ఆఫర్ ప్రకటించింది.
ఈ స్పెషల్ థాలీలో 12 రకాల వంటకాలను అందుబాటులో ఉంచింది. ఫ్రైడ్ సూర్మాయి, పోమ్రెట్ ఫ్రైడ్ ఫిష్, చికెన్ తందూరీ, డ్రై మటన్, గ్రే మటన్, చికెన్ మసాలా, కొలుంబి బిర్యానీలతో ఉండే ఈ ప్లేట్‌ను 55 మంది టీమ్ తయారు చేయడం విశేషం. ఒక్కో థాలీ ధర రూ.2,500 అని.. ఈ థాలీని తినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని, సోషల్ డిస్టెన్సింగ్ నియమాలను పాటిస్తూ ఈ కాంటెస్ట్‌ను రన్ చేస్తున్నామని హోటల్ నిర్వాహకులు చెప్పారు. సోలాపూర్ జిల్లాకు చెందిన సోమ్‌నాథ్ పవార్ అనే వ్యక్తి స్పెషల్ థాలీని నిర్ణీత టైమ్‌లో ఫినిష్ చేసి బుల్లెట్ గెల్చుకున్నాడని పేర్కొన్నారు.
