పుల్వామా దాడిలో చనిపోయిన మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ భార్య నికితా కౌల్ ఇవాళ(శనివారం) ఆర్మీలో చేరారు. తన భర్త అడుగుజాడల్లో నడుస్తూ...శనివారం కమాండర్‌గా బాధ్యతలు చేపట్టారు. నార్త్ ఆర్మీ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ వైకె జోషి ఆమె భుజంపై స్టార్స్ ను పెట్టారు. తమిళనాడులోని చెన్నైలో ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో ఈ కార్యక్రమం జరిగింది. ఆమె తన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి తన భర్తకు నివాళిగా షార్ట్ సర్వీస్ కమిషన్ పరీక్షను క్లియర్ చేసి సైన్యంలో చేరారు నికితా కౌల్.
2019లో ఫిబ్రవరిలో కశ్మీర్‌లో పుల్వామాలో ఉగ్రదాడిలో మేజర్ శంకర్ ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు అప్పటికి పెళ్లయి ఏడాది కూడా కాలేదు. చిన్న వయస్సులోనే భర్తను కోల్పోయినప్పటికీ..దేశ కోసం తన భర్త ప్రాణాలు అర్పించారని గర్వంగా ఉందని తెలిపారు. ఇప్పుడు ఆయనపై ప్రేమతో తాను కూడా ఆర్మీలో చేసి దేశ సేవకు సిద్ధమయ్యారు. ఆర్మీలో చేరాలన్న ఆమె నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు. అమరుడైన శంకర్‌కు భారత ప్రభుత్వం శౌర్య చక్ర అవార్డును అందించింది.
