- ఇప్పటికీ లక్షకుపైగా బుకింగ్స్
- సప్లై చేయలేకపోతున్న మారుతి సుజుకీ
- ఆలస్యమవుతున్న డెలివరీలు
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ మనదేశంలో తన ఎస్యూవీ మార్కెట్‌ను వేగంగా బలోపేతం చేస్తోంది. ఈ కంపెనీ మిడ్‌సైజ్ ఎస్‌యూవీల కోసం జనం ఎగబడుతున్నారు. ముఖ్యంగా గ్రాండ్ విటారా, బ్రెజ్జాలకు కస్టమర్ల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. తగిన టైమ్‌కు డెలివరీ ఇవ్వలేక కంపెనీ తంటాలు పడుతోంది. ఉదాహరణకు ఎర్టిగా సీఎన్జీ కావాలంటే కొన్ని రాష్ట్రాల్లో తొమ్మిది నెలల వరకు ఆగాల్సి వస్తోంది. బ్రెజ్జా ఆటోమేటిక్ కావాలంటే కనీసం 7.5 నెలలు వేచిచూడాలి. ఈ రెండు బండ్లకు తక్కువ ధర ఎక్కువ ఫీచర్లు ఉండటంతో జనం ఎగబడుతున్నారు. కంపెనీ ఇప్పటికే ముఖ్యమైన కాస్మెటిక్, ఫీచర్ మెకానికల్ అప్గ్రేడ్లతో కొత్త తరం బ్రెజ్జాను పరిచయం చేసింది. హ్యుందాయ్ క్రెటాకు పోటీగా డెవెలప్ చేసిన మిడ్-సైజ్ ఎస్యూవీ గ్రాండ్ విటారా కూడా లాంచ్ అయింది. ఈ రెండు ఎస్‌యూవీల కోసం ఇప్పటి వరకు లక్ష బుకింగ్స్వచ్చాయి. కొత్త బ్రెజ్జా కోసం కంపెనీ 75వేల బుకింగ్స్‌ను తీసుకుంది. త్వరలో అమ్మకానికి రాబోతున్న గ్రాండ్ విటారా కోసం 26 వేల మంది ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఈ రెండు కొత్త ఎస్యూవీ లకు అద్భుతమైన స్పందన లభిస్తోందని అన్నారు.
హైబ్రిడ్ వేరియంట్లకు డిమాండ్..
మారుతి గ్రాండ్ విటారా కోసం ప్రీ-బుకింగ్స్‌లో సగానికి పైగా హైబ్రిడ్ టెక్ వేరియంట్ కోసమే వచ్చాయి. దీనిని సుజుకి గ్లోబల్- సి ప్లాట్‌ఫారమ్ ఆధారంగా స్మార్ట్ హైబ్రిడ్ టెక్‌తో తయారు చేశారు. ఇది 1.5 లీటర్ కే15సీ డ్యూయల్ జెట్ పెట్రోల్, 1.5లీటరు టీఎన్జీఏ పెట్రోల్ వెర్షన్లతో అందుబాటులో ఉంటుంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లలో ఏదో ఒక దానిని ఎంచుకోవచ్చు. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉండే ఆల్‌గ్రిప్ ఏడబ్ల్యూడీ సిస్టమ్.. 4 డ్రైవింగ్ మోడ్‌లను అందిస్తుంది . వీటిలో- ఆటో, శాండ్, స్నో లాక్ ఉంటాయి. మాన్యువల్ ఎఫ్‌డబ్ల్యూడీ వేరియంట్ 21.1 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఆటోమేటిక్ ఎఫ్‌డబ్ల్యూడీ మోడల్ 20.58 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మాన్యువల్ ఏడబ్ల్యూడీ వెర్షన్ 19.38 కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ ప్రకటించింది. మారుతి సుజుకి 2023 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో తన సరికొత్త కూపే ఎస్యూవీ ని కూడా లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మోడల్‌ను సుజుకి హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌లో రూపొందించారు. ఇది బూస్టర్‌జెట్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. కొత్త మారుతి వైటీబీ కూపే ఎస్యూవీ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో కూడా అందిస్తారని సమాచారం. బ్రెజ్జా ఎక్స్ షోరూమ్ ధర రూ. 8–14 లక్షలు, విటారా ధర రూ. 11–18 లక్షలు.
గ్రాండ్ విటారాను లాంచ్ చేసిన యాక్టర్ పాయల్ రాజ్‌పుత్
మారుతి సుజుకీ గ్రాండ్ విటారా కొత్త మోడల్ ను హైదరాబాద్ మార్కెట్ లో విడుదల చేసింది. హైదరాబాద్నాగోల్ లోని కళ్యాణి మోటర్స్ నెక్సా లో ఈ ఎస్‌యూవీని టాలీవుడ్ నటి పాయల్ రాజ్‌పుత్ లాంచ్ చేశారు. గ్రాండ్ విటారా కోసం తమకు ఇప్పటి వరకు 200 లకు కంటే ఎక్కువ బుకింగ్స్ వచ్చాయని కళ్యాణి మోటార్స్ తెలిపింది.
ఏ కారుకు ఎంత వెయిటింగ్ పీరియడ్ ?
మోడల్ వెయిటింగ్ పీరియడ్
(వారాలు)
బ్రెజ్జా ఎల్ఎక్స్ఐ 34-38 బ్రెజ్జా వీఎక్స్ఐ 8-12 బ్రెజ్జా జెడ్ఎక్స్ఐ,
జెడ్ఎక్స్ఐ+ 16-20
బ్రెజ్జా ఆటోమేటిక్ 30-32
ఎర్టిగా పెట్రోల్ 16-20
ఎర్టిగా సీఎన్జీ 34
