నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C50 రాకెట్

నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C50 రాకెట్

PSLV సీ-50 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న షార్‌ అంతరిక్ష కేంద్రం నుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటల 41 నిమిషాలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నాలుగు దశలను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని కక్ష్యలోకి ప్రవేశించింది. PSLV సీ-50 రాకెట్ ద్వారా1,410 కిలోల బరువు గల CMS-1 శాటిలైట్ నిర్ణీత కక్ష్యలోకి చేరింది. 2011లో పంపిన జీశాట్-12 ఉపగ్రహ జీవిత కాలం పూర్తి కావడంతో దాని స్థానంలో సేవలందించేందుకు CMS-1ను పంపించారు. ఇది సీ బ్యాండ్ లో టెలికాం సేవలందిస్తుంది. సీ బ్యాండ్ తో భారతదేశ ప్రధాన భూభాగంతో పాటు అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు విస్తృతం కానున్నాయి.

రెండు టన్నులకు మించి బరువు కలిగిన అతి పెద్ద ఉపగ్రహాలను ఫ్రాన్స్, రష్యా అంతరిక్ష సంస్థల నుంచి ఇస్రో పంపిస్తోంది. అతి చిన్న విదేశీ ఉపగ్రహాలను PSLV ల ద్వారా ప్రయోగించి వాణిజ్యపరంగా ఇస్రోకు ఆదాయాన్ని తీసుకొచ్చేదిగా మారింది. చంద్రయాన్, మంగళ్‌యాన్‌ లాంటి గ్రహాంతర ప్రయోగాలు, ఒకేసారి పది ఉపగ్రహాలు, 20 ఉపగ్రహాలు, ఆ తర్వాత 104, మళ్లీ 38 ఉపగ్రహాలను సునాయాసంగా మోసుకెళ్లి అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టగలిగిన ఘనత PSLV  సొంతం. ఇప్పటి వరకు 51 PSLV  రాకెట్లను ప్రయోగించగా అందులో రెండు మాత్రమే విఫలమయ్యాయి. గురువారం నాటి ప్రయోగంతో మరో కీలక ఘట్టానికి షార్‌ వేదికైంది.