విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : వంగ మహేందర్ రెడ్డి

  • పీఆర్టీయూ టీఎస్​ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి

మెదక్​, వెలుగు: రానున్న ఎన్నికల్లో  మెదక్​, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్​ టీచర్​ ఎమ్మెల్సీగా గెలిపిస్తే శాసనమండలిలో  టీచర్ల గొంతుక అవుతానని పీఆర్టీయూ టీఎస్​ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ లో నూతన టీచర్ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా​ ఆయన మీడియాతో మాట్లాడారు. 1998 డీఎస్సీలో ఎంపికై 25 ఏళ్లు టీచర్‌‌గా పనిచేసి 2022లో వీఆర్​ఎస్​ తీసుకున్నానని తెలిపారు. 

టీచర్‌‌గా పని చేసినపుడు స్వచ్ఛందంగా విద్యార్థుల చదువుకు చేయూత అందించడంతోపాటు,  వీఎంఆర్​ ఫౌండేషన్​ ఏర్పాటుచేసి 500 గవర్నమెంట్​ స్కూల్​ విద్యార్థులకు స్కూల్​ బ్యాగ్​లు, బుక్కులు, పెన్నులు,  టై, బెల్ట్​లు వంటివి అందించానన్నారు. 1,500 స్కూల్​ లకు వాల్​ క్లాక్​లు, కొన్నిస్కూల్​ లకు వాటర్ ప్యూరిఫైర్​లు అందించానన్నారు.

టీచర్​ల సంక్షేమం, స్కూల్​లలో నెలకొన్న సమస్యల పరిష్కారం, పటిష్టత కోసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు తెలిపారు. పీఆర్టీయూలో మండల స్థాయి నుంచి అంచెలంచెలుగా రాష్ట్ర అసోసియేట్​ అధ్యక్షుడి స్థాయికి ఎదిగిన తనకు టీచర్​ల సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. తాను ఎమ్మెల్సీగా ఎన్నికైతే 13 జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేసి  ​వాటి ద్వారానే నిధులు ఖర్చు చేస్తానన్నారు. తాను మెదక్ లో టీటీసీ చేశానని, తన ఫస్ట్​ పోస్టింగ్​ మెదక్ జిల్లాలోనే అని గుర్తు చేశారు.

తమ సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు చేపట్టడం జరిగిందని, ఇప్పటి వరకు 22,588 మంది టీచర్​లు ఓటు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఇతర సంఘాలు కూడా తనకు మద్దతు ఇస్తున్నాయని మహెందర్ రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్​ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుంకరి కృష్ణ, సామ్యానాయక్​, వెంకట్​ రాంరెడ్డి, అసోసియేట్​ అధ్యక్షుడు మల్లారెడ్డి, బాధ్యులు శ్రీనివాస్​, సంతోష్​ కుమార్​  తదితరులు పాల్గొన్నారు.