సమగ్ర కుటుంబ సర్వే త్వరగా పూర్తిచేయాలి :  నల్లు ఇంద్రసేనా రెడ్డి

సిద్దిపేట, వెలుగు: ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే త్వరగా పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నల్లు ఇంద్రసేనా రెడ్డి, శశిధర శర్మ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం వారు సిద్దిపేటలో మీడియాతో మాట్లాడారు. మూడు వారాల నుంచి  ప్రాథమిక స్కూళ్లు మూసి టీచర్లను గణనకు కేటాయించడం వల్ల  విద్యావ్యవస్థకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగైదు రోజుల్లో సర్వే పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తే స్టూడెంట్స్​కు, విద్యావ్యవస్థకు నష్టం జరగకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు. రెండో శనివారం, ఆది, సోమ, మంగళవారాలు వరుసగా  సర్వే నిర్వహిస్తే  రెండు రోజులు సెలవులుండడం వల్ల పనిదినాలపై ప్రభావం ఉండదన్నారు. 


సంగారెడ్డి టౌన్: సమగ్ర కుటుంబ సర్వేకు ప్రైమరీ స్కూళ్ల టీచర్లను  మాత్రమే కేటాయించడం సరికాదని టీపీటీఎఫ్​జిల్లా ప్రధాన కార్యదర్శి రామచందర్, రాష్ట్ర కౌన్సిలర్​లక్ష్మయ్య యాదవ్ అన్నారు. ప్రైమరీ స్కూళ్లలో ఉండేదే ఒక్కరిద్దరు టీచర్లని వారిని సైతం సర్వేకు కేటాయిస్తే స్కూళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతుందన్నారు. స్టూడెంట్స్​, క్లాసులకు ఇబ్బంది కలగకుండా ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వాన్ని 
కోరారు.

మెదక్​టౌన్: సమగ్ర కుటుంబ సర్వేకు ప్రాథమిక స్కూళ్లలో విధులు నిర్వహించే టీచర్లను మినహాయించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్​) మెదక్​ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్​కోరారు. మెదక్​ పట్టణంలోని తపస్​ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ..  ప్రభుత్వం సర్వేకు అత్యవసర విభాగాలు మినహాయించి మిగిలిన అన్ని విభాగాల ఉద్యోగులతో పని చేయించి రెండు రోజుల్లో సర్వే పూర్తిచేయాలని కోరారు. గతంలో ఒకే రోజు సమగ్ర కుటుంబ సర్వే చేసిన విషయాన్ని ఎల్లం, లక్ష్మణ్​ గుర్తు చేశారు.