టీడీపీ, జనసేనలో భగ్గుమంటున్న నిరసన సెగ..!

టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటనతో ఇరు పార్టీల్లో అసమ్మతి సెగ మొదలైంది. టికెట్ దక్కిన నేతలు సంబరంగా ఉండగా ఆశాభంగం కలిగిన చాలా మంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గజపతి నగరం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్లెక్సీలు చించేసి నిరసన తెలపగా, అనకాపల్లి వంటి పలు చోట్ల టీడీపీలో అసమ్మతి సెగ భగ్గుమంది. అనంతపురం జిల్లా పెనుగొండలో ఆగ్రహజ్వాలలు రగిలాయి. టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు ప్లెక్సీలు చించేసి నిప్పు నిరసన తెలియజేసారు.కాకినాడ జనసేన ఇంచార్జ్ సూర్యచంద్ర తనకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

తొలి జాబితాలో చోటు దక్కని గంటా శ్రీనివాసరావుకి రెండో జాబితాలో అయినా టికెట్ దక్కుతుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. రాజమండ్రి రూరల్ నుండి టికెట్ ఆశించి భంగపడ్డ బుచ్చయ్య చౌదరి రాజకీయాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం సీట్ల పంపకం కొలిక్కి రాక జుట్టు పీక్కున్న పార్టీల అధిష్టానాలకు ఇప్పుడు అసమ్మతి సెగ కొత్త తలనొప్పిగా మారింది. 

టీడీపీ సీనియర్లు ఆశిస్తున్న చాలా వరకు స్థానాల్లో చాలా చోట్ల బీజేపీ, జనసేనలు టికెట్ డిమాండ్ చేస్తుండటంతో చంద్రబాబు చాలా మందిని పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. సీటు త్యాగం చేసినవారికి ప్రభుత్వం ఏర్పడ్డాక తగిన న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నప్పటికీ ఈ రేంజ్ లో అసమ్మతి సెగ రాగలటం పొత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.