- నేషనల్ హైవేలు దిగ్బంధం.. రాష్ట్రంలో 163 రైళ్లు రద్దు
- మూతపడ్డ వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలు
- పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్న అన్నదాతలు
- కేంద్రం తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు
చండీగఢ్: రైతుల ఆందోళనతో పంజాబ్ స్తంభించింది. పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) సహా తమ డిమాండ్లను నెరవేర్చడంలో కేంద్ర సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అన్నదాతలు సోమవారం బంద్‌కు పిలుపునిచ్చారు. రైతుల డిమాండ్లను నెరవేర్చాలంటూ పంజాబ్‌వ్యాప్తంగా కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌లో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. రోడ్లపైకి తరలివచ్చి నిరసన తెలిపారు. ఖనౌరీ సరిహద్దులోని రైతుల నిరసన స్థలంలో గత 35 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దలేవాల్‌కు సంఘీభావం గా బంద్ పాటించారు. రాష్ట్రంలోని వాణిజ్య, వ్యాపార, విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. రోడ్డు, రైలు మార్గాలను రైతులు దిగ్బంధించారు. భటిండాలోని రాంపురా ఫూల్, మొహాలీలోని ఐఐఎస్‌ఈఆర్ చౌక్ వద్ద ఎయిర్‌పోర్ట్ రోడ్డు, పాటియాలా, జలంధర్, అమృత్‌సర్, ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్‌తో సహా పలు రోడ్లు, రహదారులపై రైతులు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూర్చొని, ప్రయాణికుల రాకపోకలను అడ్డుకున్నారు. లాల్రూ సమీపంలోని అంబాలా – ఢిల్లీ హైవే, ఖరార్ – మొరిండా హైవే సహా కీలక మార్గాలను రైతులు దిగ్బంధించారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200కిపైగా రోడ్లను రైతులు బ్లాక్ చేశారు. దీంతో రవాణా సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అమృత్‌సర్‌లోని గోల్డెన్ గేట్ వద్ద కొందరు రైతులు ఆందోళన చేయగా.. గోల్డెన్ టెంపుల్‌కు వెళ్లే విదేశీ యాత్రికులకు పోలీసులు ఆటో రిక్షాలు ఏర్పాటు చేసి, వారిని సురక్షితంగా పంపించారు.
దలేవాల్‌కు ట్రీట్మెంట్పై నేడు సుప్రీం పరిశీలన
రైతుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రైతు నేత జగ్గిత్ సింగ్ దలేవాల్ నిరాహార దీక్ష సోమవారంతో 35వ రోజుకు చేరుకున్నది. అనారోగ్యంతో బాధపడుతున్న దలేవాల్‌కు చికిత్స అందించేందుకు పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను సుప్రీంకోర్టు మంగళవారం పరిశీలించనున్నది. ఈ అంశంపై దాఖలైన వ్యాజ్యంపై జస్టిస్ సూర్యకాంత్, సుధాంశు ధూలియాలతో కూడిన వెకేషన్బెంచ్ వర్చువల్‌గా విచారణ చేపట్టనున్నది.
నిలిచిన రైళ్లు
రైతుల బంద్ ప్రభావంతో రైల్వే సేవలు నిలిచిపోయాయి. పంజాబ్-–ఢిల్లీ మధ్య 163 రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. పంజాబ్‌లోని రైల్వేస్టేషన్లలో సరైన సమాచారం లేక ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. కాగా, అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చినట్టు రైతు నాయకుడు సర్వణ్‌సింగ్ పందేర్ తెలిపారు. అత్యవసరంగా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లే వారిని, జాబ్ ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారిని, దవాఖానలకు వెళ్లేవారిని అడ్డుకోబోమని ప్రకటించారు. బంద్ నేపథ్యంలో మొహాలి జిల్లాలో 600 మంది పోలీసులను అధికారులు మోహరించారు.