న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ సస్పెండెడ్ నేతలు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన కామెంట్లకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఢిల్లీ, యూపీ, బెంగాల్, జార్ఖండ్, తెలంగాణ సహా అనేక ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ప్రార్థనల అనంతరం ముస్లింలు ర్యాలీలు నిర్వహించారు. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌ను అరెస్ట్ చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించి, వాటిని తగలబెట్టారు. అనేక చోట్ల అల్లరిమూకలు రాళ్లు రువ్వడం, ఇండ్లు, షాపులకు నిప్పు పెట్టడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అల్లరి మూకలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలు చోట్ల టియర్ గ్యాస్ ప్రయోగించి, గాలిలోకి కాల్పులు జరిపారు. కేంద్ర హోం శాఖ ముందుగానే హెచ్చరికలు చేయడంతో అనేక సిటీల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాంచీలో శుక్రవారం నిరసనలు హింసాత్మకంగా మారాయి. అల్లరిమూకలు రాళ్లు విసరడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ప్రయాగ్‌రాజ్ సిటీలోని అటాలా ఏరియాలో పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. కోల్‌కతాలోనూ
ఆందోళనలు చేశారు.
మేం పిలుపివ్వలే: ఢిల్లీ జామా మసీదు ఇమామ్
ఢిల్లీలోని జామా మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనల అనంతరం నిరసనలు మొదలయ్యాయి. అయితే, జామా మసీదు తరఫున ఎలాంటి నిరసనలకు పిలుపు ఇవ్వలేదని, మసీదు ముందు గుమిగూడిన వాళ్లంతా బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లేనని మసీదు పెద్ద షాహీ ఇమామ్ చెప్పారు. నిరసనలు చేసిన వాళ్లు ఎంఐఎం లేదా ఒవైసీ మనుషులు కావచ్చన్నారు.
