అమరావతి, వెలుగు:
ఆంధ్రప్రదేశ్‌లో 3 రాజధానులపై నిరసనగళం పెరుగుతోంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళన నాలుగో రోజుకు చేరుకుంది. శనివారం వెలగపూడి, మందడం గ్రామాల్లో రైతులు రిలే నిరాహార దీక్షలు, రహదారుల దిగ్భంధనం చేపట్టారు. విజయవాడ, గుంటూరు నుంచి అమరావతి, సచివాలయం, అసెంబ్లీ వెళ్లే రోడ్లపై టైర్లు తగులబెట్టారు. సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను కాల్చేశారు. తమను ముంచేశారంటూ మందడంలో రోడ్డుమీద పడవ ఎక్కి మహిళలు నిరసన తెలిపారు.వెలగపూడిలో ఉరికంబానికి వేలాడుతున్న రైతు దిష్టిబొమ్మను ఏర్పాటు చేశారు. అమరావతి నుంచే రాష్ర్ట పరిపాలన సాగించాలని, కాదంటే ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతివ్వాలని కోరారు. పెనుమాక, మందడం, తుళ్లూరు, వెంకటపాలెం గ్రామాల్లో వైసీపీ సానుభూతి పరులు ఆందోళనకు మద్దతు తెలిపారు. వెలగపూడిలో వైసీపీ పార్టీ రంగు వేసిన స్థానిక పంచాయతీ కార్యాలయాలకు నల్ల రంగు వేశారు.
రాజు మారితే రాజధాని మారుస్తారా?: బీజేపీ ఏపీ అధ్యక్షుడు
రాజు మారితే రాజధానిని మార్చేస్తారా అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ప్రశ్నించారు. రాజధాని మార్పు చారిత్రక కారణాలతో జరుగుతుందని, కానీ ఏపీలో మాత్రం జగన్ సొంత ప్రయోజనాల కోసం జరుగుతోందని ఆరోపించారు. బాబుపై కక్షతో ప్రజలను జగన్ ఇబ్బంది పెడుతున్నారన్నారు. వైసీసీ సర్కారు చేసే పిచ్చి పనుల్లో కేంద్రం జోక్యం చేసుకోదని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని, కానీ అమరావతి రైతులకు ఇచ్చిన హామీలూ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
రైతుల గుండెలపై తన్నారు: ఉమా
రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా త్వరలోనే చంద్రబాబు పోరాడతారని మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. జగన్ పుట్టిన రోజు కానుకగా అమరావతి రైతుల గుండెలపై తన్నారని విమర్శించారు.
‘సేమ్’ సిఫార్సులతో ప్రతిపాదనలు
3 రాజధానుల ఏర్పాటుపై జగన్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ర్టాభివృద్ధి, రాజధాని ఎంపిక నిర్మాణంపై నియమించిన జీఎన్‌రావు కమిటీతో పాటు, బోస్టన్ కమిటీ మధ్యంతర నివేదికను తెప్పించుకుంది. ఆ కమిటీలు చెప్పిన ఒకే రకమైన సిఫార్సులతో సీఎంవో ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. 27న జరిగే కేబినేట్ భేటీలో కమిటీ నివేదికను చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత జనవరి తొలివారంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని భావిస్తోంది. ఆ భేటీలోపు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) తుది నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

