న్యూఢిల్లీ: కరోనా, లాక్‌డౌన్ వల్ల రియల్ ఎస్టేట్ కుదేలయిందని, ఈ పరిస్థితుల్లో ‘రెడీ టూ మూవ్’ ఇండ్లను అమ్ముకోవాలంటే బిల్డర్లు డిస్కౌంట్లు ఇవ్వడం తప్ప వేరే మార్గమేదీ లేదని ప్రాపర్టీ బ్రోకరేజ్ కంపెనీ అనరాక్ స్పష్టం చేసింది. ప్రస్తుతం డెవలపర్ల దగ్గర ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ పుణేలో 78 వేల ఇండ్లు అమ్మకానికి రెడీగా ఉన్నాయి. వీటి విలువ రూ.66 వేల కోట్లు ఉంటుందని అంచనా. డెవలపర్ల దగ్గర లిక్విడిటీ లేదు కాబట్టి డిస్కౌంట్లతో అమ్మకాలు పెంచుకోవాలని అనరాక్ సూచించింది. అయితే హోల్డింగ్ కెపాసిటీ ఉన్న వాళ్లు ఆగొచ్చని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి చెప్పారు. ‘‘బలమైన బ్యాలన్స్‌షీట్, హోల్డింగ్ కెపాసిటీ ఉన్న వాళ్లు డిస్కౌంట్లు ఇచ్చే అవకాశాలు తక్కువ. అర్జంటుగా డబ్బు కావాలనుకునేవాళ్లు మాత్రం తక్కువ ధరలకే అమ్మవచ్చు. మొత్తం 6.44 లక్షల యూనిట్లలో అమ్ముడుపోని ఇన్వెంటరీ వాటా 12 శాతం. మిగతా 88 శాతం ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. తొలిసారిగా ఇల్లు కొనాలనుకునేవారు డెవలపర్లతో బేరమాడితే తక్కువ రేటుకే ఇంటిని దక్కించుకోవచ్చు. హోమ్‌లోన్లపై వడ్డీలు కూడా 7.8 శాతం లోపే ఉన్నాయి’’ అని ఆయన వివరించారు. లాక్‌డౌన్ వల్ల నిలిచిపోయిన ఇండ్ల రిజిస్ట్రేషన్‌ను ఆన్‌లైన్‌లో చేయాలని కొన్ని రాష్ట్రాలు భావిస్తున్నాయి.
హైదరాబాద్ కథ వేరే
అనరాక్ రిపోర్టు హైదరాబాద్ సహా చాలా నగరాల్లో ఇండ్లకు డిమాండ్ తగ్గుతున్నదని పేర్కొనగా, హైదరాబాద్‌లో ఫ్లాట్ల విలువ పెరిగిందని ఆన్‌లైన్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్ డాట్ కాట్ రిపోర్టు వెల్లడించింది. భారతదేశపు ఫార్మా రాజధానిగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో ఆస్తుల విలువ గత సంవత్సరం జనవరి క్వార్టర్‌తో పోలిస్తే ఈసారి జనవరిలో క్వార్టర్‌లో తొమ్మిది శాతం పెరిగింది. 2019 ఆర్థిక సంవత్సరపు నాలుగో క్వార్టర్‌లో ఫ్లాట్ల చదరపు అడుగుకు సగటు ధర 4,977 రూపాయలు కాగా, 2020 ఆర్ధిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌లో ఇది రూ.5,434లకు చేరింది. దీంతో హైదరాబాద్ రేట్లు బెంగళూరు, చెన్నైని మించిపోతున్నాయి. అయితే వార్షిక ప్రాతిపదికన చూస్తే ఇండ్ల అమ్మకాలు 39 శాతం పడిపోయాయి. గత నెల 31తో ముగిసిన నాలుగో క్వార్టర్‌లో కేవలం 5,554 యూనిట్లు అమ్ముడయ్యాయి. వీటిలో కేవలం 14 శాతం యూనిట్లు మాత్రం అందుబాటులో ధరల కేటగిరీలో వస్తాయి. అంటే వీటి ధరలు 45 లక్షల రూపాయల లోపు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు గత సంవత్సరంతో పోలిస్తే 56 శాతం తగ్గాయి. మార్చి క్వార్టర్‌లో 3,904 యూనిట్లు మాత్రమే మొదలయ్యాయని అనరాక్ రిపోర్టు తెలిపింది.
