మిర్చి రైతుకు.. మళ్లీ నష్టాలే !

  • సీజన్‌‌ ప్రారంభంలోనే రూ. 7500 తగ్గిన ధర
  • గతేడాది ఇదే సీజన్‌‌లో క్వింటాల్‌‌కు రూ. 23 వేలు పలికిన మిర్చి
  • ఈ సారి గరిష్టంగా దక్కుతుంది రూ.15,500 మాత్రమే..
  • నాణ్యత లేదంటూ మరో రూ. 2 వేల నుంచి రూ. 3 వేలు కోత పెడుతున్న వ్యాపారులు

వరంగల్, వెలుగు : రాష్ట్రంలో మిర్చి ధరలు భారీ స్థాయిలో పడిపోతున్నాయి. గత సీజన్‌‌ మిర్చిని నెలల తరబడి కోల్డ్‌‌ స్టోరేజీల్లో దాచుకున్నా.. చివరికి సరైన ధర రాక అగ్గువకే అమ్ముకొని రైతులు నష్టాలపాలయ్యారు. తాజాగా చేతికొచ్చిన కొత్త పంటనైనా మంచి ధర పలికితే గత నష్టాల నుంచి గట్టెక్కొచ్చని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. ఏడాది ప్రారంభంలోనే మిర్చి పంటతో మార్కెట్లకు వస్తున్న రైతులు ధరలను చూసి కన్నీరు పెడుతున్నారు. గతేడాది ఇదే సీజన్‌‌లో పలికిన ధరతో పోలిస్తే ప్రస్తుతం రూ.7,500 తగ్గింది. ఇది సరిపోదన్నట్లు మాయిశ్చర్‌‌, క్వాలిటీ అంటూ కొర్రీలు పెడుతూ వ్యాపారులు మరికొంత తగ్గిస్తున్నారు. దీంతో ఈ సీజన్‌‌ పంటనైనా వెంటనే అమ్ముకోవాలో ? లేక మళ్లీ కోల్డ్‌‌ స్టోరేజీల్లో భద్రపరుచుకోవాలో ? తెలియక రైతులు అయోమయంలో పడిపోయారు.

గతేడాది రూ.23 వేలు.. ఇప్పుడు రూ.15,500 

గతేడాది మిర్చి సీజన్‌‌ ప్రారంభమైన జనవరి మొదటి వారంలో ధరలు భారీ స్థాయిలో పలికాయి. తేజ రకం మిర్చి క్వింటాల్‌‌ రూ.23 వేల నుంచి రూ.21,500 మధ్యన పలికింది. వండర్‌‌హట్‌‌ రూ.18,500, యూఎస్ 341 రకం రూ.15,500, తేజ ఏసీ రకం రూ.20 వేలు, వండర్‌‌హట్‌‌ ఏసీ రూ.23 వేలు, యూఎస్ 341 ఏసీ రకం మిర్చి రూ.16 వేలు పలికింది. కాగా, అంతకుముందున్న ఏడాదితో పోలిస్తే ఈ రేట్లే తక్కువ అని రైతులు భావించారు. కానీ ప్రస్తుతం ఆ ధరలు కూడా అమాంతం పడిపోయాయి. రైతులు ఎక్కువ సాగు చేసే తేజ రకానికి చెందిన మిర్చి వరంగల్‌‌ ఏనుమాముల మార్కెట్‌‌లో గరిష్టంగా రూ.15,500 పలుకుతోంది. ఈ లెక్కన గత ప్రారంభ సీజన్‌‌ ధర కంటే ఈ సారి క్వింటాల్‌‌కు ఏకంగా రూ.7,500 తగ్గింది.

తేమ, క్వాలిటీ పేరుతో ధర తగ్గిస్తున్న వ్యాపారులు

మార్కెట్‌‌లో మిర్చి పంటకు ధర కట్టే క్రమంలో వ్యాపారులు గోల్‌‌మాల్‌‌ చేస్తుండగా, వారికి ఆఫీసర్లు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిర్చి మార్కెట్‌‌లో ఆఫీసర్లు, వ్యాపారులు కలిసి జెండా పాటతో ఒక రేట్‌‌ ఫిక్స్‌‌ చేస్తారు. గతంలో వ్యాపారులు తేమ, క్వాలిటీ వంటి సాకులు జెండా పాట రేటు కంటే రూ.500 నుంచి రూ. వెయ్యి తగ్గించి కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు జెండా పాటపై క్వింటాల్‌‌కు రూ.3 వేల నుంచి  రూ.7 వేల మధ్యన ధర తగ్గిస్తున్నారు. గతేడాది ఇలాగే ధర తగ్గించడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఇప్పుటైనా ఆఫీసర్లు స్పందించి వ్యాపారులు గోల్‌‌ మాల్‌‌ చేయకుండా చూడాలని పలువురు రైతులు కోరుతున్నారు. 

ఏటేటా తగ్గిపోతున్న ధరలు

రాష్ట్రంలో మిర్చి ధరలు ఏటేటా తగ్గుముఖం పడుతున్నాయి. 2023 సీజన్‌‌లో ఇదే తేజ రకం మిర్చి క్వింటాల్‌‌కు రూ. 25 వేల వరకు పలుకగా 2024 జనవరి సీజన్‌‌ వచ్చే సరికి రూ.23 వేలకు పడిపోయింది. ఈ సారి మరింత తగ్గి క్వింటాల్‌‌కు రూ. 15,500 తగ్గడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. ఇండోనేషియా, తదితర దేశాల్లో జరిగిన ఎన్నికల ఎఫెక్ట్‌‌, అంతర్జాతీయ మార్కెట్‌‌ అనుకూలంగా లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలు మిర్చి ఎగుమతులను తగ్గించుకోగా, సింగపూర్, మలేషియా దేశాలకు చైనా నుంచి పంట వెళ్తోందని చెబుతున్నారు. అయితే తేజ రకం మిర్చికి మాత్రం క్వాలిటీ ఆధారంగా చైనా మార్కెట్‌‌లో క్వింటాల్‌‌కు రూ. 14 వేల నుంచి రూ.15 వేల వరకు ధరలు ఉండనున్నట్లు మార్కెట్అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది కూడా జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే ఉంటుందని, మార్చి నెలలో రూ.14 వేలలోపు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

రైతులు ఇప్పుడే పంటను తేవొద్దు 


రాష్ట్రంలో గత రెండేండ్లతో పోలీస్తే ఈ ఏడాది మిర్చి ధరలు తగ్గిన మాట వాస్తవమే. అంతర్జాతీయ మార్కెట్‌‌లోకి ఎగుమతులు తగ్గడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఏనుమాముల మార్కెట్‌‌లో తేజ రకానికి గరిష్టంగా క్వింటాల్‌‌కు రూ. 15,500 నుంచి రూ. 15,800 చెల్లిస్తున్నాం. ధరలు తక్కువగా ఉన్నందున రైతులు ఇప్పుడే పంటను తీసుకురావద్దు. మార్కెట్‌‌లో నెలకొన్న పరిస్థితులు, కోల్డ్‌‌ స్టోరేజీల సామర్ధ్యం, రైతులకు మేలు చేసే అంశాలపై త్వరలోనే కలెక్టర్‌‌ ఆధ్వర్యంలో మీటింగ్‌‌ ఉంటుంది. పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.


- శ్రీనివాస్, మార్కెటింగ్‌‌ శాఖ జాయింట్‌‌ డైరెక్టర్‌‌-