ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వెంచర్ కు రోడ్డు

  • సర్వే నెంబర్ 1002లో యధేచ్ఛగా100 ఫీట్ల రోడ్డు నిర్మాణం
  • చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు
  • కలెక్టర్ స్పందించాలని స్థానికుల ఆందోళనలు

సంగారెడ్డి/జిన్నారం, వెలుగు : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని సర్వే నెంబర్1002లో ఉన్న  ప్రభుత్వ భూమిని కబ్జా చేసి పక్కనే ఉన్న ఓ ప్రైవేట్​వెంచర్ కు100 ఫీట్ల తారు రోడ్డు వేస్తున్నారు. ఇందుకు బడా లీడర్లు, అధికారులు సహకరిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికులు కలిసి పోరాటం చేస్తుంటే ఆక్రమణదారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా ఉన్నతాధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

రోడ్డు ఆక్రమణ ఇలా.. 

జిన్నారం గురుకుల స్కూల్​కు వెళ్లే ప్రధాన దారిని ఆనుకొని 1002 సర్వే నంబర్ ఉంది. ఇది పూర్తిగా ప్రభుత్వ స్థలం. ఇందులో ప్రభుత్వ జూనియర్ కాలేజీ, గురుకుల స్కూల్​, రైతు వేదిక, వ్యవసాయ గోదాం, మినీ స్టేడియం ఉన్నాయి. రైతులు, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మరికొంత ప్రభుత్వ భూమి ఉండగా దాన్ని ఆనుకుని ఓ ప్రైవేట్ వెంచర్ తయారవుతోంది. దానికి రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడంతో చిన్నగా ఉన్న రోడ్డును ఇరువైపులా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కలుపుకొని 100 ఫీట్ల రోడ్డుగా మలిచి వెంచర్ కు దారి వేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. 

అఖిలపక్షం ఆధ్వర్యంలో..

ప్రభుత్వ భూమి కబ్జాపై కొందరు స్థానిక లీడర్లు, ప్రజలు కలిసి అఖిలపక్షంగా ఏర్పడి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా రోడ్డు పనులు ఆగలేదు. దీంతో తహసీల్దార్ ఆఫీసు ముందు గ్రామస్తులు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అయినా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ భూమిలో అక్రమంగా వేసిన రోడ్డును తొలగించి ఆ భూమి కబ్జాకు గురికాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం

ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. సర్వే నెంబరు1002లో అక్రమంగా రోడ్డు వేస్తున్నట్టు ఫిర్యాదులు అందాయి. చుట్టుపక్కల ప్రైవేట్​భూములు ఉన్నందున దీనిపై సమగ్ర విచారణ కొనసాగుతోంది. ప్రజలు ఆరోపించినట్లు వాస్తవాలు బయటపడితే ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం.

- భిక్షపతి, తహసీల్దార్