మనదేశంలో ప్రైవేట్ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు రైల్వే నిర్వహాణ బాధ్యతల్ని స్వీకరించిన ప్రైవేట్ సంస్థలు ప్రయాణికుల నుంచి ఛార్జీల్ని వసూలు చేసేందుకు కేంద్రం అనుమతులిచ్చింది.
ఈ సందర్భంగా రైల్వే బోర్డ్ ఛైర్మన్ వీకే యాదవ్ మాట్లాడుతూ ఏసీ బస్సులు, విమానాలు నడిచే ప్రాంతాల్లో ప్రైవేట్ రైల్ సర్వీసులు ఉంటాయని, ఆప్రాంతాల్లో నడిచే ప్రైవేట్ రైల్ ఛార్జీలు ఎంత వసూలు చేయాలనే అంశం సంబంధిత ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఉంటుందని చెప్పారు.
ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు ఆల్స్టమ్ ఎస్ఏ, బంబార్డియర్, జీఎంఆర్, అదాని గ్రూప్ ఆసక్తి చూపుతున్నాయన్న రైల్వే బోర్డు ఛైర్మన్ ..రాబోయే రోజుల్లో ప్రైవేట్ సంస్థల ద్వారా రైల్వేలోకి 7.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని స్పష్టం చేశారు.
దేశంలోని 109 రూట్లల్లో 151 ప్రైవేట్ రైళ్లు ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. రైల్వే ఆధునీకకరణలో ఢిల్లీ, ముంబై రైల్వే స్టేషన్లు ఉన్నట్లు తెలిపారు. కాగా 2023 నాటికి జపాన్ నుంచి అతి తక్కువ ఖర్చుతో బుల్లెట్ ట్రైన్ నిర్మించాలంటే రైల్వే వ్యవస్థలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రైల్వే బోర్డు చైర్మన్ వికె యాదవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
