SMAT: 5 మ్యాచ్‌ల్లో రెండు డకౌట్లు.. భారత క్రికెటర్ కథ ముగిసినట్టేనా

ఇండియా క్రికెట్‌‌‌‌లో తన రాకను ఘనంగా చాటుకొని ఇంటర్నేషనల్ లెవెల్‌‌‌‌తో పాటు ఐపీఎల్‌‌‌‌లోనూ మెరుపులు మెరిపించిన 25 ఏండ్ల పృథ్వీ షా పేలవ ఫామ్ కొనసాగుతుంది. అతను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ విఫలం కావడంతో అతని కంబ్యాక్ కష్టంగానే కనిపిస్తుంది. సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా మరోసారి డకౌటయ్యాడు. కేవలం మూడు బంతులు ఎదుర్కొని పూనమ్ పూనియా బౌలింగ్ లో ఔటయ్యాడు. ఈ టోర్నమెంట్‌లో షా కు ఇది రెండో కాగా.. అంతకముందు మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్ లోనూ ఈ యువ ఆటగాడు పరుగులేమీ చేయలేదు. 

అద్భుతమైన టాలెంట్‌‌‌‌ ఉన్నా.. దాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకోలేక టీమిండియాకు దూరమైన షా ఐపీఎల్‌‌‌‌ చాన్స్‌‌‌‌ కూడా కోల్పోయాడు.  ఇటీవలే జరిగిన మెగా ఆక్షన్ లో అతన్ని ఎవరూ తీసుకోలేదు. ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా కంబ్యాక్ ఇద్దామనుకున్నా సాధ్యం కాలేదు. 2018లో ఐపీఎల్‌‌‌‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌కు ఆడుతున్న పృథ్వీ పవర్‌‌‌‌‌‌‌‌ప్లే స్పెషలిస్ట్‌‌‌‌గా పేరు తెచ్చుకున్నాడు.

లీగ్‌‌‌‌లో 79 మ్యాచ్‌‌‌‌లు ఆడి 14 ఫిఫ్టీలు సహా 1892 రన్స్ చేశాడు. తొలి ఓవర్లోనే ఆరు బాల్స్‌‌‌‌లో ఆరు ఫోర్లు కొట్టిన రికార్డు కూడా తన పేరిట ఉన్నా వేలంలో డీసీ పట్టించుకోలేదు. మిగతా ఫ్రాంచైజీలు కూడా ఆసక్తి చూపలేదు. రెండుసార్లు వేలంలో అతని పేరు వినిపించినా.. ఎవ్వరూ ముందుకు రాలేదు. దాంతో ఆరేండ్ల కిందట అండర్‌‌‌‌‌‌‌‌ 19 వరల్డ్ కప్‌‌‌‌ నెగ్గిన కెప్టెన్‌‌‌‌గా ప్రశంసలు అందుకొని ఇండియా క్రికెట్‌‌‌‌లో  సచిన్‌‌‌‌ టెండూల్కర్‌‌‌‌‌‌‌‌ తర్వాత ఆ స్థాయికి వెళ్తాడని అనుకున్న పృథ్వీ  కెరీర్‌‌‌‌‌‌‌‌ అత్యల్ప స్థాయికి చేరుకుంది. 

సాధారణంగా టీమిండియాకు దూరమైన ఆటగాళ్లు డొమెస్టిక్ క్రికెట్‌‌‌‌లో సత్తా చాటి తిరిగి వస్తుంటారు. అయితే,  రంజీలతో పాటు కౌంటీ క్రికెట్‌‌‌‌లో  అప్పుడప్పుడు మెరిసినా షా నేషనల్ టీమ్‌‌‌‌లోకి తిరిగి రాలేకపోవడానికి కారణం అతని క్రమశిక్షణ లేకపోవడమే. చిన్న వయసులోనే వచ్చిన స్టార్‌‌‌‌‌‌‌‌డమ్‌‌‌‌ అతనిపై ప్రతికూల ప్రభావం చూపింది. ఒకప్పుడు ఇరుకు గదిలో ఉండి, లోకల్ ట్రెయిన్‌‌‌‌లో నిల్చొని ప్రయాణించి వచ్చి  గ్రౌండ్‌‌‌‌లో గంటల కొద్దీ ప్రాక్టీస్‌‌‌‌ చేసిన షా.. తాను సెలబ్రిటీ అయిన తర్వాత గాడి తప్పాడు.

పబ్బులు, అమ్మాయిలు అంటూ పక్కదారి పట్టి క్రికెట్‌‌‌‌ను నిర్లక్ష్యం చేశాడు. కనీసం తన శరీరంపై కూడా శ్రద్ధ చూపలేక బరువు పెరిగిన షా ఫిట్‌‌‌‌నెస్  కూడా కోల్పోయాడు. దాంతో కొన్ని రోజుల కిందట ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అతడిని రంజీ జట్టు నుంచి కూడా తప్పించింది. నిజానికి గత ఐపీఎల్‌‌‌‌ సీజన్లలో షా తీరుపై ఢిల్లీ జట్టు తీవ్ర అసంతృప్తితో ఉంది.