హోంవర్క్‌‌‌‌ చేయలేదని స్టూడెంట్‌‌‌‌ను చెట్టుకు వేలాడదీసిన ప్రిన్సిపాల్‌‌‌‌

  • సంగారెడ్డి జిల్లా వట్‌‌‌‌పల్లిలో ఘటన

సంగారెడ్డి/వట్‌‌‌‌పల్లి, వెలుగు : హోంవర్క్ చేయలేదన్న కోపంతో ఓ స్కూల్‌‌‌‌ ప్రిన్సిపాల్‌‌‌‌ ఏడో తరగతి స్టూడెంట్‌‌‌‌ను చెట్టుకు వేలాడదీసి  చితక బాదాడు. తీవ్రగాయాలు కావడంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా వట్‌‌‌‌పల్లి మండల కేంద్రంలో మంగళవారం వెలుగుచూసింది. బాధిత తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

నవీన్‌‌‌‌ అనే స్టూడెంట్‌‌‌‌ వట్‌‌‌‌పల్లిలోని అక్షర స్కూల్‌‌‌‌లో ఏడో తరగతి చదువుతున్నాడు. అతడు నోట్స్‌‌‌‌ రాయకపోవడంతో స్కూల్‌‌‌‌ ప్రిన్సిపాల్‌‌‌‌ షేక్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ను తీవ్రంగా కొట్టి, చెట్టుకు వేలాడదీశాడు. నవీన్‌‌‌‌ ఛాతి, కాళ్లపై గాయాలు కావడంతో గమనించిన తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేయించారు. ఆదివారం సెలవు కావడంతో సోమవారం స్కూల్‌‌‌‌ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. 

విషయం తెలుసుకున్న పోలీసులు స్కూల్‌‌‌‌ వద్దకు వచ్చి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం మరోసారి ఇలాంటి తప్పు చేయబోనని, భవిష్యత్‌‌‌‌లో ఏ స్టూడెంట్‌‌‌‌ను కూడా కొట్టబోనని ప్రిన్సిపాల్‌‌‌‌ షేక్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ రాతపూర్వకంగా రాసిచ్చి, క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.