అద్రాస్ పల్లిలో ఆదిమానవుల ఆనవాళ్లు

హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం అద్రాస్ పల్లిలో ఆదిమానవుల ఆనవాళ్లను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు గుర్తించారు. అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్, కొరివి గోపాల్ తో కూడిన బృందం పెద్దరాతి యుగం(మెగాలిథిక్) సమాధులను కనిపెట్టింది. సమాధుల పరిసరాల్లో ఉన్న మెన్హర్లు( నిలువు రాళ్లు)తోపాటు ఒక మెగాలిథిక్ సమాధికి 18 బంతిరాళ్లు ఉన్నాయని బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు. మధ్యలో సమాధికి సంబంధించిన పలకరాళ్లు(ఆర్థోస్టాట్స్) పైకి కనిపిస్తున్నాయని, ఇది సిస్టుబరియల్(పెట్టె సమాధి)అని చెప్పారు. మెన్హర్లు12 నుంచి 14అడుగుల ఎత్తు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతంలో పెద్దఎత్తున సమాధులున్నట్లు నిలువు రాళ్లు సూచిస్తున్నాయన్నారు.

మన రాష్ట్రంలో  కనీసం పదిలక్షల బృహత్ శిలాయుగపు సమాధులుండవచ్చని హైదరాబాద్ ఆర్కియలాజికల్ సొసైటీ సభ్యుడు ఈహెచ్.హంట్ అనే యూరోపియన్ పరిశోధకుడు 1925లో రాసిన తన గ్రంథంలో  పేర్కొన్నారు. గడిచిన వందేండ్లలో నగర విస్తీర్ణం, వ్యవసాయానికి భూములసాగు, అడవుల నరికివేత, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలవల్ల లక్షల్లో ఈ సమాధులు అదృశ్యమయ్యాయని హరగోపాల్ వివరించారు. మేడ్చల్ జిల్లాలో ఇటీవల తాము పర్యటించి రాతిచిత్రాలు, పెట్రోగ్లైప్స్, పెద్ధరాతియుగం సమాధులు, రాతిపనిముట్లను  గుర్తించామని  చెప్పారు. ఈ చారిత్రక ఆనవాళ్లను పరిశోధించడానికి  రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు.