మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం.. భారత్, కువైట్ మధ్య స్నేహ సంబంధాల బలోపేతానికి చేసిన కృషికి..

కువైట్ సిటీ: ప్రధాని నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఆయనకు తమ దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్–కబీర్’ను కువైట్ అందజేసింది. భారత్, కువైట్ మధ్య స్నేహ సంబంధాల బలోపేతానికి మోదీ చేసిన కృషికి గాను ఈ అవార్డు ఇచ్చింది. ఆదివారం కువైట్ సిటీలోని బయాన్ ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధాని మోదీకి కువైట్ ఎమిర్ షేక్ మెషల్ అల్–అహ్మద్ అల్–జాబర్ అల్–సబా అందజేశారు.

ఈ పురస్కారాన్ని భారత ప్రజలు, ఇండియా–కువైట్ స్నేహ సంబంధాలకు అంకితం ఇస్తున్నట్టు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఈ అవార్డు ఇండియా, కువైట్ మధ్య ఉన్న చిరకాల స్నేహానికి నిదర్శనమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.

మోదీ అంతకుముందు బయాన్ ప్యాలెస్ లో గౌరవ వందనం స్వీకరించారు. గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్ నుంచి కూడా ఆయనకు గౌరవ వందనం లభించింది. కాగా, ఇది ప్రధాని మోదీకి 20వ అంతర్జాతీయ పురస్కారం. స్నేహానికి చిహ్నంగా వివిధ దేశాల అధినేతలు, రాజ కుటుంబ సభ్యులకు కువైట్ ఈ పురస్కారం అందజేస్తుంది. ఇంతకుముందు విదేశీ నేతలు బిల్ క్లింటన్, ప్రిన్స్ చార్లెస్, జార్జ్ బుష్ తదితరులకు ఇచ్చింది.

రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం..
రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని కువైట్, ఇండియా నిర్ణయించాయి. తమ బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకుంటున్నట్టు తెలిపాయి. ద్వైపాక్షిక సంబంధాలపై కువైట్ ఎమిర్ షేక్ మెషల్ అల్–అహ్మద్ అల్–జాబర్ అల్–సబాతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, ఫిన్ టెక్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, రక్షణ రంగాల్లో సహకారంపై చర్చించారు. అలాగే కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్-ఖలీద్ అల్-సబాతోనూ మోదీ సమావేశమయ్యారు.

‘‘కువైట్ ఎమిర్​తో సమావేశం చాలా బాగా జరిగింది. రెండు దేశాల మధ్య బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయించాం. పలు కీలక రంగాల్లో సహకారంపై చర్చించాం. రానున్న రోజుల్లో రెండు దేశాల మధ్య బంధం మరింత బలోపేతమవుతుంది” అని ప్రధాని మోదీ సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.

మోదీ పర్యటనతో భారత్, కువైట్ మధ్య బంధాలు కొత్త శిఖరాలకు చేరనున్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. కువైట్ లో భారతీయుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలపై ఎమిర్​కు మోదీ కృతజ్ఞతలు చెప్పారన్నారు. కాగా, రెండ్రోజుల పర్యటన నిమిత్తం మోదీ శనివారం కువైట్ వెళ్లారు. మొదటి రోజు ఇండియన్ కమ్యూనిటీ ప్రజలతో సమావేశమయ్యారు. లేబర్ క్యాంప్ ను సందర్శించారు.

కువైట్ పర్యటన విజయవంతం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల కువైట్ పర్యటన ముగించుకుని ఆదివారం అర్ధరాత్రి అక్కడి నుంచి బయల్దేరి ఇండియా చేరుకున్నారు. ఈ మేరకు పర్యటన గురించి ట్విటర్​లో ఆయన వివరించారు. ‘‘కువైట్ పర్యటన విజయవంతమైంది. రెండు దేశాల మధ్య సహకారం, అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. ద్వైపాక్షిక బంధం మరింత బలపడనున్నది.

కువైట్ ప్రభుత్వం, అక్కడి ప్రజల ఆప్యాయతకు ధన్యవాదాలు. సెండాఫ్ ఇచ్చేందుకు వచ్చిన కువైట్ పీఎంకు థ్యాంక్స్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్, ఫిన్​టెక్, ఇన్​ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీ రంగాల్లో సహాయ సహకారాలు అందిపుచ్చుకునేందుకు నిర్ణయించాం’’అని మోదీ తెలిపారు. కాగా, 40 ఏండ్ల తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గల్ఫ్ దేశ పర్యటనకు వెళ్లడం గమనార్హం.