న్యూఢిల్లీ: దేశ ఐక్యతే మహాకుంభ మేళా సందేశమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వచ్చే నెల 13 నుంచి ప్రయాగ్‌రాజ్‌లో ఈ మహోత్సవం ప్రారంభం కానుంది. ఇందులో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిస్తూ.. కుంభమేళా సందర్భంగా సమాజం నుంచి ద్వేషాన్ని, విభజనను పారదోలుతామనే సంకల్పం తీసుకోవాలని కోరారు. గంగానది ప్రవాహంలా సమాజమంతా ఒక్కటిగా ఉండాలని అన్నారు. ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే ‘మన్‌కీ బాత్’ కార్యక్రమం 117వ ఎసిపోడ్‌లో ప్రధాని మోదీ పలు విషయాలు పంచుకున్నారు.
ప్రతి 12 ఏండ్లకోసారి మహా కుంభమేళాను నిర్వహిస్తారని, ఇందులో లక్షలాది మంది భక్తులతోపాటు వివిధ అఖాడాలకు చెందిన సాధువులు పాల్గొంటారని తెలిపారు. ఈ కుంభమేళాకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. టూర్ప్యాకేజీలు, వసతి వంటి సమాచారం తెలుసుకునేందుకు భక్తులకు ఏఐ చాట్‌బాట్ మొత్తం 11 భాషల్లో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.
ఒడిశాలోని కలహండి జిల్లా గోలముండా బ్లాక్‌లో రైతులు వెజిటెబుల్రెవల్యూషన్ను సృష్టించారని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్(ఎఫ్‌పీవో)ను స్థాపించి.. అత్యాధునిక పద్ధతులతో కూరగాయలు పండిస్తూ ఆ ప్రాంతాన్ని వెజిటెబుల్హబ్గా మార్చేశారన్నారు. అన్ని భాషల వారు రాజ్యాంగం గురించి తెలుసుకునేలా ఓ వెబ్సైట్ రూపొందించామని తెలిపారు. ఇందులో రాజ్యాంగ పీఠికను చదువుకోవచ్చని తెలిపారు.
ఏఎన్నార్ సినిమాల్లో భారతీయ విలువలు
సినిమా, టీవీ, యానిమేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో భారత్ఎంతో పురోగతి సాధించిందని మోదీ తెలిపారు. ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని చెప్పారు. 2024లో బాలీవుడ్దిగ్గజాలు రాజ్‌కపూర్, మహమ్మద్ రఫీతో సహా పలువురు సినీ ప్రముఖుల 100వ జయంతి సందర్భంగా ప్రధాని మాట్లాడారు. అక్కినేని నాగేశ్వర్రావు తెలుగు సినిమాకు చేసిన కృషిని కొనియాడారు. ఆయన తెలుగు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారని చెప్పారు.
అక్కినేని సినిమాల్లో భారతీయ విలువలు, సంప్రదాయాలు చాలా చక్కగా చూపించేవారని గుర్తుచేశారు. బాలీవుడ్ దర్శకుడు తపన్ సిన్హా సినిమాలు సమాజానికి కొత్త బాటలు వేశాయన్నారు. రాజ్ కపూర్ తన సినిమాల ద్వారా దేశంలోని సున్నితమైన అంశాలను ప్రపంచానికి పరిచయం చేశారని వెల్లడించారు. కాగా, వచ్చే ఏడాదిలో దేశంలోనే తొలిసారిగా వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమిట్(వేవ్)ను నిర్వహించబోతున్నామని వెల్లడించారు.
ఆరోగ్య రంగంలో భారత్ మెరుగు
ఆరోగ్య రంగంలో భారత్ మెరుగుప డిందని మోదీ తెలిపారు. డబ్ల్యూహెచ్‌వో రిపోర్ట్ ప్రకారం.. 2015–2023 వరకు భారత్‌లో మలేరియా కేసులు, మరణాల సంఖ్య 80% తగ్గిందన్నారు. క్యాన్సర్ చికిత్సను సకాలంలో ప్రారంభించే అవకాశాలు పెరిగాయని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన స్టడీ వెల్లడించిం దన్నారు. క్యాన్సర్ రోగుల కు సకాలంలో చికిత్స అందించడం లో ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.