వినూత్న పద్ధతులతో వ్యాక్సినేషన్ వేగం పెంచాలి

వినూత్న పద్ధతులతో వ్యాక్సినేషన్ వేగం పెంచాలి

దేశంలో వ్యాక్సినేషన్ వేగం తగ్గడం మంచిది కాదని హెచ్చరించారు ప్రధని మోడీ. 100 కోట్ల డోసులు పంచేశామని అజాగ్రత్త వహించడం తగదన్నారు. టీకా పంపిణీ పలు జిల్లాల్లో నెమ్మదిగా సాగడంపై సమీక్ష నిర్వహించారు. 40 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. డాక్టర్లు , వైద్య సిబ్బంది, అధికారుల కృషి కారణంగా  వ్యాక్సినేషన్​లో దేశం ఈ స్థాయిలో పురోగతి సాధించిందన్నారు. జిల్లా అధికారుల నుంచి.. ఆశావర్కర్ల వరకు ప్రతి ఒక్కరూ టీకా పంపిణీ కోసం పాటు పడ్డారని తెలిపారు. 100 కోట్ల డోసులు పంచేశామని అజాగ్రత్త వహిస్తే.. మరో సంక్షోభం ముంచుకొచ్చే ప్రమాదం  ఉందన్నారు.వ్యాక్సిన్ పంపిణీలో అపోహలు, పుకార్ల రూపంలో సవాళ్లు ఎదురవుతాయన్నారు. ఈ క్రమంలో వీలైనంత మందికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం స్థానిక మతపెద్దల సహాయం తీసుకోవాలని సూచించారు. గ్రామ, పట్టణాల స్థాయిలో వినూత్న పద్ధతులు పాటించి వ్యాక్సినేషన్ వేగం పెంచాలని అన్నారు. ఇంటింటికీ వెళ్లి టీకాలు ఇవ్వాలని అధికారులకు ప్రధాని సూచించారు. రెండు డోసుల రక్షణ పొందనివారిని గుర్తించాలని చెప్పారు.

వ్యాధులను, శత్రువులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదన్నారు మోడీ. చివరి వరకు మనం పోరాడాలి.. కొంచెం కూడా అజాగ్రత్తగా ఉండకూడదన్నారు.  కరోనా  వందేళ్లలో అతిపెద్ద మహమ్మారి అన్నారు. దీంతో దేశం అనేక ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. కరోనాపై పోరాడేందుకు కొత్త పరిష్కారాలు కనుక్కోవడం చాలా గొప్ప విషయమన్నారు. మీ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కవరేజీ పెంచేందుకు మీరు కూడా వినూత్న పద్ధతులను పాటించాలని అన్నారు. అవసరమైతే గ్రామ, పట్టణాల స్థాయిలో 20-25 మందితో టీంలు ఏర్పాటు చేయవచ్చన్నారు. వారి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేలా చూడొచ్చన్నారు. ఇప్పటివరకు వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి.. సురక్షితంగా టీకాలు ఇచ్చారని అన్నారు. ఇప్పుడు 'హర్ ఘర్ టీకా.. ఘర్ ఘర్ టీకా'(ఇంటింటికి టీకా) స్ఫూర్తితో ప్రతి ఇంటికి వెళ్లి టీకాలు ఇవ్వాలని  సూచించారు మోడీ.