ఏపీ చేరుకున్న ప్రధాని మోడీ.. విశాఖలో భారీ రోడ్ షో

ఆంధ్రప్రదేశ్‎లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో మోడీ విశాఖకు చేరుకున్నారు. ప్రధాని మోడీకి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోడీ విశాఖలోని సిరిపురం జంక్షన్ నుండి ఏయూ వరకు భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. 

ప్రజలకు అభివాదం చేస్తూ మోడీ ముందుకు సాగారు. రోడ్ షో పొడవునా రోడ్డుకు ఇరు వైపులా నిల్చుకున్న జనం పూలు చల్లుతూ.. మోడీ మోడీ అంటూ నినాదాలు హోరెత్తించారు. ఏపీలో ఎన్డీఏ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని మోడీ రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఫస్ట్ టైమ్ ఏపీకి వచ్చిన మోడీకి ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 

ఈ రోడ్  షో అనంతరం ప్రధాని మోడీ ఏపీలో దాదాపు రూ.2.8 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విశాఖ రైల్వే జోన్‌, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు వంటి పలు పనులను మోడీ ప్రారంభించనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఈ సభకు దాదాపు 3 లక్షల మంది హాజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ పర్యటనలో భాగంగా మోడీ రెండు రోజుల పాటు ఏపీలోనే ఉండనున్నారు.