- ఇక స్టార్ లేబులింగ్ తప్పనిసరి
- పెంపు 20 శాతం వరకు?
న్యూఢిల్లీ: బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్స్(బీఈఈ) రూల్స్ మారుతున్నందున సీలింగ్ ఫ్యాన్ల ధరలు 8–20 శాతం వరకు పెరగనున్నాయి. ఈ నెల నుంచి ఫ్యాన్లకు స్టార్ లేబులింగ్ తప్పనిసరి. ఒక ఫ్యాన్ఆదా చేసే కరెంటును బట్టి 1–5 మధ్య స్టార్ లేబుల్ ఇస్తారు. 1 -స్టార్ రేటెడ్ ఫ్యాన్‌లు కనీసం 30 శాతం, 5- స్టార్ రేటింగ్ ఉన్న ఫ్యాన్లు 50 శాతానికి పైగా కరెంటును ఆదా చేస్తాయి. హావెల్స్, ఓరియంట్, ఎలక్ట్రిక్, ఉషా ఇంటర్నేషనల్ వంటి ప్రముఖ తయారీదారులు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. అయితే 5 -స్టార్ రేటెడ్ ఫ్యాన్ల తయారీ కోసం మోటార్లు, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్‌లను దిగుమతి చేసుకోవాలి. కాబట్టి తమ ఖర్చు 5 నుంచి 20 శాతం వరకు పెరుగుతుందని ఆందోళన చెందుతున్నాయి. కొత్త ఆదేశాల ప్రకారం, తయారీదారులు తమ ఫ్యాన్లపై స్టార్ రేటింగ్‌లను ప్రదర్శించడం తప్పనిసరి. స్టార్ రేటింగ్ సర్వీసు వాల్యూపై ఆధారపడి ఉంటుంది (నిమిషానికి ఫ్యాన్‌గాలి డెలివరీని క్యూబిక్ మీటర్లలో శక్తి వినియోగంతో (వాట్లలో) భాగిస్తారు). ఓరియంట్ ఎలక్ట్రిక్ ఎండీ & సీఈఓ రాకేష్ ఖన్నా ఈ విషయమై మాట్లాడుతూ ఫ్యాన్ల మార్కెట్‌కు ఇది భారీ మార్పని అన్నారు. ఇక నుంచి కస్టమర్లు చాలా తక్కువ శక్తిని వినియోగించే నాణ్యమైన సీలింగ్ ఫ్యాన్లను పొందుతారని కామెంట్ చేశారు. అయినప్పటికీ, స్టార్ రేటింగ్ లేని ఫ్యాన్లను కొత్త పద్ధతికి మారడానికి తయారీదారులు అదనపు ఖర్చులను భరిస్తారు కాబట్టి ధరల పెరుగుదల 7-–8 శాతం వరకు ఉంటుందని వివరించారు.
కరెంటు బిల్లులో 20 శాతం
సగటు భారతీయ కుటుంబం వినియోగించే విద్యుత్తులో సీలింగ్ ఫ్యాన్ల వాటా 20 శాతం ఉంటుంది. ఈ స్టార్ -రేటెడ్ ఫ్యాన్లు అంతిమంగా వినియోగదారునికి ప్రయోజనం చేకూర్చడంతోపాటు కరెంట్‌ను ఆదా చేస్తాయి. ఉషా ఇంటర్నేషనల్ సీఈఓ దినేష్ ఛబ్రా మాట్లాడుతూ, స్టార్ లేబులింగ్ 1-స్టార్ రేటెడ్ ఫ్యాన్లు 30 శాతం వరకు, 5-స్టార్ రేటెడ్ ఫ్యాన్లు 50 శాతానికి పైగా కరెంటును ఆదా చేస్తాయని అన్నారు. తమ1-స్టార్ రేటెడ్ ఫ్యాన్ల ధరలు 5–-7 శాతం వరకు, 5-స్టార్ రేటెడ్ ఫ్యాన్ల ధరలు 20 శాతం వరకు పెరుగుతాయని వివరించారు. ఫ్యాన్ల ధర ఉత్పత్తి, ప్రస్తుత డిజైన్, స్టార్ రేటింగ్ (1 నుంచి 5) పనితీరు (ఎయిర్ డెలివరీ)పై ఆధారపడి ఉంటుందని ఛబ్రా చెప్పుకొచ్చారు.
