రూ.100 దాటిన పెట్రోల్ ధర

రూ.100 దాటిన పెట్రోల్ ధర
  • రాజస్థాన్​లో రూ. 100 దాటిన లీటర్ ధర
  • హైదరాబాద్​లో పెట్రోల్​ రూ. 93.10, డీజిల్​ 87.20

న్యూఢిల్లీ: పెట్రోల్ సెంచరీ మార్కు దాటిపోయింది. ఆయిల్ కంపెనీలు వరుసగా 9వ రోజు ధరలను పెంచడంతో పెట్రోల్ రేటు దేశంలోనే తొలిసారిగా రూ. 100 దాటింది. బుధవారం ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ రేట్లను మరో 25 పైసలు పెంచాయి. దీంతో రాజస్థాన్​లోని శ్రీగంగానగర్​లో లీటరు పెట్రోల్ రేటు రూ. 100.13కు పెరిగింది. డీజిల్ ధర రూ. 92.13కు చేరింది. ఎక్కువ ట్యాక్స్​లు పడే బ్రాండెడ్, యాడిటివ్ బేస్డ్ పెట్రోల్ రేట్లు గతంలోనూ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తదితర స్టేట్స్​లో రూ. 100 మార్కును దాటాయి. కానీ రెగ్యులర్ పెట్రోల్ ధర సెంచరీ దాటడం దేశంలో ఇదే ఫస్ట్ టైం.

పెట్రోల్, డీజిల్ ధరలు ఫ్రైట్ చార్జెస్, వ్యాట్ వంటి లోకల్ ట్యాక్సులను బట్టి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయి. ఫ్యూయెల్ పై రాజస్థాన్ ప్రభుత్వం దేశంలోనే అత్యధికంగా వ్యాట్ ను విధిస్తోంది. గత నెలలో 2 శాతం వ్యాట్ ను తగ్గించుకుంది. అయినా అన్ని స్టేట్స్ కంటే ముందుగా అక్కడే పెట్రోల్ సెంచరీ దాటిపోయింది. 2 శాతం తగ్గించుకున్నా, ఇప్పటికీ రాజస్థాన్ లోనే పెట్రోల్ పై వ్యాట్ (36 శాతం), రోడ్ సెస్ (లీటరుపై రూ. 1.50) అత్యధికంగా ఉన్నాయి. డీజిల్ పై వ్యాట్ 26 శాతం, రోడ్ సెస్ రూ. 1.75 వద్ద ఉన్నాయి.

హైదరాబాద్ లో రూ.93కు..

బుధవారం నాటి పెంపుతో హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ. 93.10కి, డీజిల్ రేటు రూ. 87.20కి చేరాయి. ఢిల్లీలో పెట్రోల్ రేటు రూ. 89.54కు, డీజిల్ రేటు రూ. 79.95కు పెరిగాయి. ముంబైలో పెట్రోల్ ధర రూ. 96కు, డీజిల్ రూ. 86.98కి చేరాయి. మధ్యప్రదేశ్ లోని అనుపూర్ లో పెట్రోల్ రూ. 99.90కి, డీజిల్ రూ.90.35కు పెరిగాయి. ఇక రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో బ్రాండెడ్ పెట్రోల్ రూ. 102.91కి, బ్రాండెడ్ డీజిల్ రూ. 95.79కి చేరుకున్నాయి. ఢిల్లీలో బ్రాండెడ్ పెట్రోల్ రూ. 92.37కు, అదే గ్రేడ్ డీజిల్ రూ. 83.24కు పెరిగాయి.

పెట్రోల్ పై 9 రోజుల్లో రూ. 2.59

ఆయిల్ కంపెనీలు 9 రోజుల్లో మొత్తంగా పెట్రోల్ పై లీటరుకు రూ.2.59, డీజిల్‌పై లీటరుకు రూ. 2.82 మేరకు రేట్లను పెంచాయి. పెట్రోల్ పై రీటైల్ ధరకు అదనంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60% వరకూ ట్యాక్సుల రూపంలో వసూలు చేస్తున్నాయి. కేంద్రం పెట్రోల్ పై రూ. 32.90, డీజిల్ పై రూ. 31.80 ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేస్తోంది. దీనికి అదనంగా ఆయా రాష్ట్రాల్లో వ్యాట్, రోడ్ సెస్ రూపంలో ట్యాక్సులు వేస్తున్నారు. మొత్తంగా పోయినఏడాది మార్చి నుంచి ఇప్పటిదాకా రిటైల్ పెట్రోల్ రేటు లీటరుకు రూ. 19.95, డీజిల్ రూ. 17.66 మేరకు పెరిగింది.