పరిహారం ఇవ్వరు.. పొజిషన్​ చూపరు

  • ఆందోళన బాటలోటీజీఐఐసీ భూ నిర్వాసితులు
  • కంపెనీల నిర్మాణ పనుల అడ్డగింత

సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో  గత ప్రభుత్వం ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేసి ఫుడ్ ఫ్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభించాలని నిర్ణయించి అసైన్డ్ భూములను టీజీఐఐసీ (తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) కి కేటాయించింది.  నాలుగేళ్ల కింద  వర్గల్, అవుసులోని పల్లి, మల్లారెడ్డిపల్లి, చౌదర్​పల్లి జీపీ రైతుల నుంచి 783 ఎకరాల అసైన్డ్ భూమిని 292 మంది రైతుల నుంచి సేకరించింది.

ఎకరాకు రూ.10 లక్షల పరిహారంతో పాటు కోల్పోయిన భూ విస్తీర్ణాన్ని బట్టి ఒక్కో కుటుంబానికి 120 నుంచి 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రస్తుతం కొన్ని కంపెనీల పనులు పూర్తికాగా మరికొన్ని కంపెనీల పనులు కొనసాగుతున్నాయి. నాలుగేండ్లు గడిచినా నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం, అధికారులిచ్చిన మాట ప్రకారం ఇండ్ల స్థలాల అప్పగింత జరగక పోవడంతో వారంతా ఇప్పడు ఆందోళన బాటపట్టారు.

అసంపూర్తి పరిహారం

గత ప్రభుత్వ హయాంలో టీజీఐఐసీకి సేకరించిన భూములకు సంబంధించి ఇంకా కొందరికి పరిహారం అందాల్సి ఉంది. అధికారులు పట్టా భూములకే పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో కబ్జాలో ఉన్న తమ భూములకు సైతం పరిహారం ఇవ్వాలని పలువురు రైతులు కొంత కాలంగా ఆందోళన చేస్తున్నారు. అలాగే టీజీఐఐసీ కోసం సేకరించిన భూ విస్తీర్ణాన్ని బట్టి ఇంటి స్థలాలను కేటాయిస్తామని అధికారులు మొదట హామీ ఇచ్చారు.

అందులో భాగంగా తక్కువ భూమి కోల్పోయిన వారికి ఎక్కువ విస్తీర్ణం, ఎక్కువ భూమి కోల్పోయిన వారికి తక్కువ విస్తీర్ణంలో ఇంటి స్థలాలు కేటాయించారు. నిర్వాసితులకు ఇండ్ల పట్టాలిచ్చి ఏండ్లు గడిచినా ఇప్పటికీ పొజిషన్ చూపక పోవడంతో ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. వర్గల్ లోని నవోదయ విద్యాలయం సమీపంలో నిర్వాసితుల  ఇంటి స్థలాల కోసం భూమిని ఎంపిక చేసి చదును చేసినా ఇంత వరకు వారికి అక్కడ పొజిషన్ చూపలేదు.

ఆందోళనలో నిర్వాసితులు

నాలుగేండ్ల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించిన భూములకు పూర్తి స్థాయి పరిహారం, ఇంటి జాగాల పొజిషన్ చూపక పోవడంతో నిర్వాసితులు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. గతంలో పలుమార్లు ఈ సమస్యలపై అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా టీజీఐసీసీ భూముల్లో కంపెనీల నిర్మాణ పనులను అడ్డుకుని నిరసన తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. 

కబ్జాలోని భూమికి పరిహారం ఇవ్వలేదు

వర్గల్ జీపీ పరిధిలో ఉన్న ఆరు ఎకరాల అసైన్డ్ పట్టా భూమికి మాత్రమే పరిహారం ఇచ్చారు. కబ్జాలో ఉన్న మరో మూడు ఎకరాలకు పరిహారం ఇవ్వలేదు. ఇతరులు కబ్జాలో ఉన్న భూమికి సైతం  పరిహారం ఇచ్చిన అధికారులు నా పట్ల వివక్ష చూపుతున్నారు. ఈ విషయంపై ఎన్నిసార్లు అధికారులను కలిసినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా కబ్జా భూమికి పరిహారంతో పాటు ఇంటికి సంబంధించి పొజిషన్ చూపాలని కోరుతున్నా. - తేగుల్ల రాములు, వర్గల్

పరిహారం, ప్లాట్ల సమస్యను పరిష్కరించాం

 టీజీఐఐసీకి భూములిచ్చిన నిర్వాసితులందరికీ పరిహారంతో పాటు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం.ఎక్కువ భూములు  కోల్పోయిన రైతులు అదనంగా ఇంటి స్థలం కేటాయించాలనే  విషయంలో  నివేదికను తయారుచేసి ఉన్నతాధికారులకు పంపించాం. దీనిపై అధికారుల నిర్ణయం మేరకు నడుచుకుంటాం. నిర్వాసితులకు ఇండ్ల పొజిషన్ చూపడానికి ప్రయత్నాలు చేస్తున్నాం.
- బాలరాజు, తహసీల్దార్, వర్గల్

వర్గల్ జీపీ పరిధిలోని రైతు కుమ్మరి నర్సింలుకు  రెండెకరాల అసైండ్ భూమి ఉంది. నాలుగేండ్ల కింద అధికారులు టీజీఐఐసీ కోసం అతడి భూమిని సేకరించారు. కానీ పరిహారం మాత్రం ఇప్పటి వరకు ఇవ్వలేదు. అదే భూమిలో అధికారులు రోడ్డు వేసే ప్రయత్నాలు చేయగా నర్సింలు అడ్డుకున్నాడు. నాలుగేండ్లు గడిచినా పరిహారం ఇవ్వక పోగా సాగు చేసుకుందామంటే అడ్డుతగలడంతో నర్సింలు ఆందోళన బాట పట్టాడు. ఇతడి మాదిరి చాలామంది టీజీఐఐసీ కోసం అసైన్డ్ భూములిచ్చి పూర్తి పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇండ్ల పట్టాలిచ్చినా స్థలాల పొజిషన్ చూపలేదు.