శ్రీనగర్ : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జమ్ము కాశ్మీర్, లడఖ్ లో నాలుగు రోజుల పర్యటన కోసం ఆదివారం శ్రీనగర్ చేరుకున్నారు. శ్రీనగర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌ఝాతోపాటు ముఖ్య ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఈనెల 28వ తేదీ వరకు రాష్ట్రపతి పర్యటన జరగనుంది. 22వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రేపు సోమవారం ఉదయం ఆయన లడఖ్‌లోని ద్రాస్ ప్రాంతాన్ని సందర్శించి కార్గిల్ వార్ స్మారకస్థూపం వద్ద 1999 కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన జవాన్లకు నివాళులర్పించనున్నారు. ఎల్లుండి 27వ తేదీన శ్రీనగర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్ 19వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన నేపధ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలుచేపట్టారు. రాష్ట్రపతి బసచేసే రాజ్‌భవన్‌కు వెళ్లే రెండు మార్గాల్లో ట్రాఫిక్‌ను దారిమళ్లించారు.
