కాసేపట్లో రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్

కాసేపట్లో  రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్

రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదల కానుంది.  కేంద్ర ఎన్నికల కమిషన్  ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు  విజ్ఞాన్ భవన్ లో నిర్వహించనున్న  మీడియా సమావేశంలో ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ప్రకటన వెలువడనుంది.  ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24న ముగియనుంది.  ఆయన పదవీకాలం ముగిసేలోపే కొత్త రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.  

ఎన్నిక ప్రక్రియ.. 

రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాలు, ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. వీరంతా కలిసి ఓటు హక్కు ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ఎమ్మెల్యేలు,  ఎంపీలు బ్యాలెట్ పేపర్లలో తమ మొదటి ఎంపిక (చాయిస్), రెండో ఎంపిక, మూడో ఎంపిక లను టిక్ చేస్తారు. మొదటి ఎంపిక ఓట్లను తొలుత లెక్కిస్తారు. మొదటి ఎంపిక ఓట్లను మెజారిటీ సంఖ్యలో పొందే రాష్ట్రపతి అభ్యర్థిని గెలిచినట్లుగా ప్రకటిస్తారు. అందులో ఎవరికీ సరైన మెజారిటీ రాకపోతే.. రెండో, మూడో ఎంపిక ఓట్లను కూడా లెక్కిస్తారు.  

తెలంగాణ, ఏపీ ఎమ్మెల్యే ఓటు విలువ.. 

ఈ ఎన్నికలో ఎమ్మెల్యేల ఓటు విలువ ఓ విధంగా, ఎంపీల ఓటు విలువ మరో విధంగా ఉంటుంది. 2017 లెక్కల ప్రకారం.. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 4,896 మంది సభ్యులు(ఉభయ సభల ఎంపీలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలు)  ఉన్నారు. వీరిలో 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలు. తొలుత ఒక రాష్ట్ర జనాభాను , ఆ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల సంఖ్యతో భాగించాలి. అలా వచ్చే విలువను 1000తో భాగించగా వచ్చేదే.. ఆ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల ఓటు విలువ. ఈ లెక్కల ప్రకారం.. రాష్ట్రపతి ఎన్నికల్లో  ఒక్కో తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువ 132.  ఒక్కో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ 159.