యువ వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించాలి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

మంగళగిరి: వైద్య వృత్తి ఎంచుకున్న యువ వైద్యులకు ప్రజల ప్రాణాలు కాపాడి, వారి ఆరోగ్యం మెరుగుపరిచే అమూల్యమైన అవకాశం వస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు.  యువ వైద్యులు గిరిజన, మారుమూల ప్రాంతాల్లో సేవలందించేందుకు ప్రాధాన్యతనివ్వాలని అన్నారు.  గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌ తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముర్ముకు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సహా పలువురు స్వాగతం పలికారు. అనంతరం ఎయిమ్స్‌కు చేరుకున్న రాష్ట్రపతి.. మొదటి బ్యాచ్‌గా వైద్య విద్య పూర్తి చేసుకున్న 49 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.

ఎయిమ్స్‌ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తాం: చంద్రబాబు

మంగళగిరి ఎయిమ్స్‌ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అత్యాధునిక సేవలందిస్తున్న మంగళగిరి ఎయిమ్స్‌ దేశంలో మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. మంగళగిరి ఎయిమ్స్‌ కోసం మరో 10 ఎకరాల స్థలం కేటాయిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు లోకేశ్, సత్యకుమార్‌ పాల్గొన్నారు.

ALSO READ | ఏపీ డిప్యూటీ సీఎంకు భారీ షాక్: షిప్ సీజ్ చేయటం సాధ్యం కాదన్న కలెక్టర్