రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం .. హాజరైన గవర్నర్, సీఎం, మంత్రులు

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఎట్‌‌ హోం నిర్వహించారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆమె.. గౌరవ విందు ఏర్పాటు చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్‌‌ వర్మ దంపతులు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, సీఎం రేవంత్‌‌ రెడ్డి, శాసన మండలి చైర్మన్‌‌ గుత్తా సుఖేందర్‌‌ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల లీడర్లు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేషన్ చైర్​పర్సన్లను సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రపతికి పరిచయం చేశారు. ఎట్ హోం సందర్భంగా వరంగల్​కు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు టీ.జానాబాయిని రాష్ట్రపతి ఆప్యాయంగా పలకరించారు. కాగా, రాష్ట్రపతి ముర్ముతో  పార్టీలకు అతీతంగా మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేకంగా సమావేశయ్యారు. గిరిజన, ఆదివాసీ ప్రజల అభివృద్ధిపై  15 నిమిషాల పాటు చర్చించారు. 

శనివారం ఉదయం 10 గంటలకు చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీని రాష్ట్రపతి సందర్శిస్తారు. కోఠి మహిళా కాలేజీ శతాబ్ది ఉత్సవాల వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం  ఢిల్లీ వెళ్తారు.