రెబెల్స్ పై రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు సీఎం ఉద్ధవ్ థాక్రే. సీఎం పదవికి రాజీనామా చేయడానికీ సిద్ధమని ప్రకటించారు. తన రాజీనామా లేఖ కూడా సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. సీఎం అధికారిక నివాసాన్ని తాను ఖాళీ చేసి.. సొంత ఇల్లు మాతోశ్రీకి వెళ్లిపోతానని తెలిపారు. అవసరమైతే పార్టీ నాయకత్వం నుంచి కూడా తప్పుకుంటానని రెబెల్ వర్గానికి ఆయన సూచించారు. అవసరమైతే పార్టీ నాయకత్వం నుంచి కూడా తప్పుకుంటానని వెల్లడించారు. తనతో ఏక్ నాథ్ షిండే నేరుగా మాట్లాడాలని.. తాను ఎక్కడ తప్పు చేశానో చెప్పాలని ఆయన సూచించారు. రెబల్స్ లో ఉన్న వారిలో ఒక్కరు సీఎంగా వద్దని చెప్పినా.. తాను పదవి నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు.
ముందే చెబితే రాజీనామా చేసేవాడిని ..
తనకు ముందే చెబితే రాజీనామా చేసేవాడినని.. దీని కోసం సూరత్‌కు వెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చిందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రశ్నించారు. నా ముందుకొచ్చి రాజీనామా చేయమని అడగండి.. ఆనందంగా రాజీనామా చేస్తానని ప్రకటించారు. తన తర్వాత ఏ శివ సైనికుడు సీఎం అయినా తనకు సంతోషమన్నారు. శివసైనికులారా మోసం చేయవద్దని సూచించారాయన. తన రాజీనామా లేఖ సిద్ధంగా ఉందని ప్రకటించారు. శివసేన అధ్యక్ష పదవిని వదులుకోవడానికి సైతం తాను సిద్ధమని తెలిపారు. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆయన బుధవారం (జూన్ 22) రాష్ట్ర ప్రజలనుద్దేశించి భావోద్వేగంగా మాట్లాడారు. కొవిడ్ సోకడంతో ఆయన ఫేస్ బుక్ ద్వారా మాట్లాడారు. కొవిడ్ సోకినా.. తనకు లక్షణాలు లేవని చెప్పారు.
బాధ్యతలు విస్మరించలేదు ..
తన బాధ్యతను ఎప్పుడూ విస్మరించలేదని..క్యాంప్ లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు తనతో ఇప్పటికే మాట్లాడారని చెప్పారు. వారిలో కొందరు తిరిగి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో తనకు అనుభవం లేకపోవడంతో ఎన్సీపీ (NCP), కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశామని.. ఆనాటి పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారు. శరద్ పవార్, సోనియాలతో మాట్లాడే నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యేలు శివసేనను మోసం చేయడం సరికాదని రెబల్ ఎమ్మెల్యేలకు సూచించారాయన. కొంతమంది శివసేన ఎమ్మెల్యేలు కనిపించకుండా పోగా.. మరికొంతమంది ఎమ్మెల్యేలు సూరత్ లో ప్రత్యక్షమయ్యారని చెప్పారు.
హిందుత్వం శివసేన ఒక్కటే ..
హిందుత్వం..శివసేన ఒక్కటేనని, నాటి శివసేనకు.. ఇప్పటి శివసేనకు ఎలాంటి పోలికల్లేవని వస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఇప్పుడూ అదే భావజాలం ఉందని స్పష్టంచేశారు. ప్రజల మద్దతుతోనే తాను ముఖ్యమంత్రి అయ్యానని, తాను నిజాయితీగా పని చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో వచ్చిన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నానని పేర్కొన్న ఆయన.. తాను ప్రజలకు దూరంగా ఉన్నానని వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. శివసేనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై కూడా ఆయన స్పందించారు.
వైఫల్యాలు ఉంటే చర్చించాలి..
శివసేనది ఎప్పుడూ హిందుత్వ నినాదమేనని, శివసేన, హిందుత్వాన్ని ఎవరూ వేరుచేయలేదన్నారు. హిందుత్వం గురించి మాట్లాడుతున్న తొలి సీఎంను తానేనని తెలిపారు. బాల్ థాక్రే ఆశయాలను, బాలసాహెబ్ ఆలోచనలనే ముందుకు తీసుకెళుతున్నామన్నారు. ఏ వైఫల్యాలు ఉన్నా తనతో చర్చించాలని.. అనంతరం నిర్ణయం తీసుకుందామని ఆయన రెబల్ వర్గానికి సూచించారు. ఏక్ నాథ్ షిండే వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి.
