ఖర్జూరంతో అదిరిపోయే వంటకాలు.. ఇవే

కొందరు స్వీట్స్ తినమంటే... "అమ్మో..! స్వీటా... వద్దు హెల్త్ పాడైపోతుంది" అని భయపడతారు. అయితే స్వీట్స్ తో నే హెల్త్ ను  కాపాడుకోవచ్చని చాలామందికి తెలియదు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఖర్జూరాలను తినాలని డాక్టర్లే చెప్తూ ఉంటారు. కానీ వాటిని అమాంతం అలాగే తినడం ఇష్టంలేక కొందరు ముట్టుకోరు. అలాంటి వాళ్లు ఖర్జూరాలతో వెరైటీ స్వీట్స్ చేసుకోవచ్చు. అప్పుడు బోర్ కొట్టకుండా ఉంటుంది. రుచితో పాటు ఆరోగ్యమూ బాగుంటుంది.

బర్ఫీ తయారీకి కావలసినవి

  • గింజలు తీసిన ఖర్జూరం -....ఒకకప్పు 
  • కోవా- ....ముప్పావు కప్పు
  • నెయ్యి .. సరిపడా.. 
  • జీడిపప్పు తరుగు... - రెండు టేబుల్ స్పూన్స్
  •  రోజ్ వాటర్-... ఒక టీ స్పూన్

  తయారీ విధానం: ఖర్జూరాలను మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. కర్జూరాలు గట్టిగా అనిపిస్తే  ఓ 10 నిమిషాలు నీళ్లలో వాసబెట్టి గ్రైండ్ చేయాలి. కోవాని చిన్నమంటపై వేడి చేయాలి. స్టవ్ పై వెడల్పాటి పాన్ పెట్టి నెయ్యి వేడి చేయాలి. అందులో ఖర్జూరాల ముద్ద కోవా, జీడిపప్పు తరుగు వేసి బాగా కలపాలి. మిశ్రమం బాగా కలిసి దగ్గరికయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. దాన్ని గంట సేపు ఫ్రిజ్ లో పెట్టి తీయాలి. తర్వాత నచ్చిన ఆకారంలోకి బర్ఫీలను కట్ చేసుకోవాలి. మ్యారేజ్ డేలకు వీటిని ఆత్మీయులకు పంచి  వేడుక చేసుకోవచ్చు .

ఖర్జూరాలతో పాయసం.. తయారీకి కావలసినవి

  • గింజలు తీసిన ఖర్జూరం -... అర కప్పు
  •  బియ్యం-.. ముప్పావు కప్పు 
  • పాలు -.. రెండు +పావు కప్పులు 
  • నెయ్యి - ....సరిపడా
  •  బెల్లం తురుము.. - ఒక టేబుల్ స్పూన్ 
  • బాదం తరుగు.... - పావు  కప్పు
  • జీడిపప్పు తరుగు... - పావు కప్పు
  •  పిస్తా తరుగు -.. ఒక టేబుల్ స్పూన్
  • ఇలాచీ పొడి ..- పావు టీస్పూన్

తయారీ విధానం: స్టవ్ పై పెద్ద గిన్నెపెట్టి రెండు కప్పుల పాలు పొయ్యాలి. అందులో బెల్లం తురుము వేసి నానబెట్టిన బియ్యం వేసి నలభై నిమిషాలు ఉడికించాలి. ఈలోపు నెయ్యిలో బా,దం, పిస్తా, జీడిపప్పు తరుగు, కిస్ మిస్ లను నెయ్యిలో విడివిడిగా వేగించాలి. ఖర్జూరాలను కూడా నెయ్యిలో వేగించి మిక్సిలో గ్రైండ్ చేయాలి. తర్వాత పాలతో వండిన అన్నంలో మిగిలిన పాలు, డ్రైఫ్రూట్స్, ఇలాచీ పొడి, ఖర్జూరం ముద్ద వేసి ఐదు నిమిషాలు చిన్న మంటపై పెట్టాలి. అంతే, ఎంతో రుచిక రమైన ఖర్జూర పాయసం రెడీ...

ఖర్జూరం రోల్స్ తయారీకి కావలసినవి

  • గింజలు తీసిన ఖర్జూరం -... ఒకకప్పు
  • జీడిపప్పు తరుగు ...- పావు కప్పు 
  • బాదం తరుగు -.. పావు కప్పు 
  • పిస్తా పలుకులు... - ఒక టేబుల్ స్పూన్ 
  • గసగసాలు... - రెండు టేబుల్ స్పూన్లు 
  • మరిగించిన చిక్కటి పాలు... - ఒక టేబుల్ స్పూన్. 
  • -నెయ్యి... ఒక టేబుల్ స్పూన్

తయారీ విధానం : జీడిపప్పు, బాదం పిస్తా తరుగును చిన్న మంట మీద వేగించాలి. తర్వాత గసగసాలను కూడా వేగించి పక్కన పెట్టాలి. అలాగే గింజలు లేని ఖర్జూరాలను కూడా తరిగి నెయ్యిలో వేగించాలి. దాంట్లో డ్రైఫ్రూటీ తరుగు వేసి కలపాలి. మంట తగ్గించి పాలు పోయాలి. మిశ్రమం దగ్గరికయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి . తర్వాత ఖర్జూరం ముద్దను రోల్ చేయాలి. దాన్ని గసగసాల్లో దొర్లించి ముక్కలుగా కట్ చేయాలి. పిల్లలతో పాటు పెద్దలకూ ఇష్టమైన, రుచిక రమైన రోల్స్ రెడీ..

ఖర్జూరంతో లడ్డూ తయారీకి కావలసినవి

  • గింజలు తీసిన ఖర్జూరం... - ముప్పావు కప్పు 
  • బాదం తరుగు ...- పావు 
  • జీడిపప్పు తరుగు- ....పావు కప్పు
  •  పిస్తా తరుగు -.. ఒక టేబుల్ స్పూన్
  • నెయ్యి... సరిపడా

తయారీ విధానం : బాదం, పిస్తా, జీడిపప్పులను చిన్న మంటపై దోరగా వేగించాలి. అలాగే ఖర్జూరాలను కూడా కొద్దిగా వేడి చేయాలి. తర్వాత వేగించిన డ్రై ఫ్రూట్స్ ను మిక్సీలో గ్రైండ్ చేయాలి. అయితే మరీ పొడిగా చేయొద్దు ఒక గిన్నెలో ఖర్జూరం ముద్ద, డ్రై ఫ్రూట్స్ మిశ్రమం వేసి బాగా కలపాలి. అలా కలిపేటప్పుడు కొద్దిగా నెయ్యి వేయాలి. ముద్దలు కట్టేటప్పుడు కూడా చేతులకు నెయ్యి రాసుకోవాలి. కావాలంటే చివర్లో లడ్డూలను ఎండు కొబ్బరి తురుములో దొర్లించాలి. వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు.