ప్రెగ్నెన్సీ డెత్స్​ కట్టడికి యాక్షన్ ప్లాన్

  • హై పవర్ కమిటీ ఏర్పాటు
  • హై రిస్క్ కేసుల కోసం హెల్ప్ లైన్ 
  • పౌష్టికాహారంపై ప్రతి వారం సమీక్ష..
  • 11నెలల్లో వెయ్యికిపైగా నార్మల్ డెలివరీలు
  • 35 వేల మంది గర్భిణులకు ఓపీ వైద్య సేవలు

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో గర్భిణుల మరణాలను అరికట్టేందుకు కలెక్టర్ నేతృత్వంలో యాక్షన్ ప్లాన్ రూపొందించారు. జిల్లాలోని ప్రభుత్వ మెటర్నటీ హాస్పిటల్​లో ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఇందుకు కలెక్టర్, హెచ్ వోడీ, వైద్యాధికారులతోపాటు హాస్పిటల్ లో పనిచేస్తున్న సీనియర్ సిబ్బందితో కలిసి హై పవర్ కమిటీని ఏర్పాటు చేయగా కార్యక్రమాలు మొదలయ్యాయి. మెటర్నిటీ హాస్పిటల్​లో జరుగుతున్న నార్మల్, సిజేరియన్ డెలివరీలు, అలాగే గర్భిణులకు అందిస్తున్న సేవలపై ఈ కమిటీ ఆధ్వర్యంలో ప్రతివారం సమీక్షించనున్నారు. హై పవర్ కమిటీ ఆధ్వర్యంలో సమస్యలపై కూడా పరిష్కార మార్గాలను కనుగొంటున్నారు. 

ఈ కమిటీకి కలెక్టర్ దిశానిర్దేశం చేస్తున్నారు. హైరిస్క్ గర్భిణుల గుర్తింపు బాధ్యతను ప్రసూతి ఆస్పత్రి పరిధిలోని ఏఎన్ఎం, ఆశా వర్కర్లతోపాటు ఆస్పత్రి పరిధిలోని పీహెచ్​సీ డాక్టర్లకు అప్పజెప్పనున్నారు. దీంతోపాటు గర్భస్థ మరణాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై వారానికి కొంతమంది వైద్యులకు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు 
నిర్వహిస్తున్నారు.

జాగ్రత్తలు, సూచనలకు హెల్ప్​లైన్

హై రిస్క్ గర్భిణుల సమస్యల పరిష్కారానికి ఇక్కడి మెటర్నటీ హాస్పిటల్​లో హెల్ప్ లైన్ డెస్క్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో నలుగురు ఏఎన్ఎంలతోపాటు కొంతమంది సిబ్బందిని నియమించారు. వీరు హై రిస్క్​లో ఉన్న గర్భిణులకు హెల్ప్​లైన్ ద్వారా ఫోన్ చేసి వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోనున్నారు. అలాగే వారి సమస్యలకు అనుగుణంగా వైద్య సేవల వివరాలు తెలియజేస్తూ జాగ్రత్తలు, సూచనలు అందించనున్నారు. గర్భిణుల్లో గుండె సంబంధిత సమస్యలు గుర్తిస్తే వారికి వెంటనే ఇక్కడి మెటర్నిటీ హాస్పిటల్​లో 2 డీ ఎకో  పరీక్షలు నిర్వహించనున్నారు. పౌష్టికాహారంపైనా తగిన సూచనలు చేయనున్నారు. 

రికార్డు స్థాయిలో డెలివరీలు

నిర్మల్ లోని గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ లో రికార్డుస్థాయిలో డెలివరీలు జరిగినట్లు హాస్పిటల్ ఇన్​చార్జ్ తెలిపారు. జనవరి నుంచి ఇప్పటివరకు హాస్పిటల్ లో మొత్తం 3276 మంది గర్భవతులకు వైద్య సేవలు అందించారు. వీరిలో 1024 మందికి నార్మల్ డెలివరీలు చేయగా.. శస్త్ర చికిత్సలతో 2250 మందికి డెలివరీలు చేశారు. ఎక్కువ మంది రోగులకు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలు అందిస్తూ ఆ సేవల ద్వారా వచ్చే ఇన్సెంటివ్ ను ఆస్పత్రి అభివృద్ధి కోసమే వెచ్చిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.

24 గంటల పాటు సేవలు అందుబాటులో..

నిర్మల్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ లో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా గర్భిణుల కోసం ప్రత్యేక సేవలందిస్తున్నాం. రికార్డుస్థాయిలో నార్మల్ డెలివరీలు చేశాం. తప్పనిసరి పరిస్థితిలోనే శస్త్రచికిత్సలు చేసి డెలివరీలు చేస్తున్నాం. గర్భిణుల కోసం అవసరమయ్యే అన్ని రకాల సౌకర్యాలు హాస్పిటల్ లో అందుబాటులో ఉన్నాయి. మందుల కొరత లేదు. - డాక్టర్ సరోజ, ఇన్​చార్జ్​గవర్నమెంట్ మెటర్నటీ హాస్పిటల్, నిర్మల్