ఎంత తెలివిగా గర్భిణుల డబ్బులు కొట్టేశారో.. ఇలా చెప్తే ఎవరైనా మోసపోవాల్సిందే

  •  ఫోన్ చేసి.. కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడి.. గర్భిణుల డబ్బులు కొట్టేశారు!
  • అధికారులమని కాల్ చేసి మోసగించిన సైబర్ నేరగాళ్లు  
  • ఇద్దరు మహిళల అకౌంట్ల నుంచి రూ. 28 వేలు డ్రా 
  • నారాయణపేట జిల్లాలో ఒకే రోజు రెండు ఘటనలు

 

నారాయణపేట, వెలుగు : అంగన్​వాడీ టీచర్ కు కాల్ చేసి.. గర్భిణి అకౌంట్ లోని రూ. 25 వేల నగదును సైబర్​ నేరగాళ్లు కొట్టేసిన ఘటన నారాయణపేట జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం నారాయణపేట టౌన్14వ వార్డులోని అంగన్​వాడీ –2 సెంటర్ టీచర్​ఫోన్ కు కాల్ వచ్చింది. 

ఓ వ్యక్తి  హిందీలో .. హైదరాబాద్​లోని హెడ్డాఫీసు నుంచి మాట్లాడుతున్నానని, అంగన్ వాడీ సెంటర్ వివరాలు కావాలని అడగడంతో నిజమేనని నమ్మి చెప్పింది. ఆపై సెంటర్​కు వచ్చే గర్భిణితో మాట్లాడుతానని ఆమెకు తెలపగా వివరాలు చెప్పడంతో కాన్ఫరెన్స్​ కాల్ ​కలిపాడు. దీంతో టీచర్ స్కూల్ కు సరిగా రావడం లేదని తప్పులు చేస్తున్నారని బెదిరించాడు. 

వారితో సుమారు15 నిమిషాలు కాన్ఫరెన్స్​కాల్​మాట్లాడిన తర్వాత ఫోన్​కట్​చేయగానే గర్భిణి బ్యాంక్ అకౌంట్ లోని రూ.25 వేలు కట్​అయినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే ఆమె అంగన్ వాడీ టీచర్ కు సమాచారం అందించింది. గర్భిణి కొడంగల్​నుంచి మాట్లాడడంతో అక్కడే కేసు నమోదు చేయాలని అంగన్​వాడీ సిబ్బందికి పోలీసులు సూచించారు. 

  • మరికల్​లో.. రూ. 3 వేలు కొట్టేశారు.. 

మరికల్ :  నారాయణ పేట జిల్లా మరికల్ అంగన్​వాడీ– 5 సెంటర్ కు చెందిన గర్భిణి అకౌంట్​నుంచి సైబర్​నేరగాళ్లు రూ.3 వేలు కొట్టేశారు.  కేంద్ర ప్రభుత్వ పథకం అంగన్​వాడీ సెంటర్లకు సంబంధించి ‘ పోషన్​ట్రాకర్’​యాప్​ఉంది. ఇందులో  కేంద్రానికి వచ్చే లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తారు. దీనిని ఆసరా చేసుకుని యాప్​కు సంబంధించిన ఆఫీసర్​ను ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నానని  కొన్ని వివరాలు కావాలని అంగన్​వాడీ టీచర్​ చంద్రకళకు ఫోన్​ చేశారు. 

ALSO READ : ఈ వారం గజగజ: టెంపరేచర్లు 3 నుంచి 5 డిగ్రీల దాకా పడిపోయే అవకాశం

ఆమెతో పాటు గర్భిణి దివ్యతోనూ కాన్ఫరెన్స్ కాల్ ​లో మాట్లాడాడు. ఇద్దరితో మాట్లాడుతూనే గర్భిణి అకౌంట్ ​నుంచి రూ.3 వేలు డ్రా అయినట్టు మెసేజ్ రాగా..  ఆమె అంగన్​వాడీ సెంటర్ కు వెళ్లి టీచర్​తో చెప్పగా అవాక్కైంది. వెంటనే సైబర్​క్రైమ్​పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బాధితులు తెలిపారు.