అన్ని వర్గాల రైతులకు ప్రాధాన్యమివ్వాలి

  • రాష్ట్ర విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరు మురళి

గండిపేట, వెలుగు:  రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలకు సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వజ్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం విద్యార్థులు, విద్యావేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు మధ్య చర్చా కార్యక్రమం జరిగింది.  ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడుతూ.. అగ్రికల్చర్  చదివే విద్యార్థులు అన్ని వర్గాల రైతులకు సమ ప్రాధాన్యమివ్వాలని సూచించారు. 

రైతుల్లో ఎక్కువమంది పేదరికంలోనే ఉన్నారని, వ్యవసాయంలో చేసే ఆవిష్కరణలు ఉత్పత్తి, ఉత్పాదకత, సుస్థిరతకు అవకాశం ఇచ్చేవిగా ఉండాలని సూచించారు. మన దేశ వ్యవసాయంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నాయని, అందుకు తగినట్టుగా విధానాలు ఉండాలని పేర్కొన్నారు. వాతావరణ మార్పుల్ని, వర్షపాత తేడాలను తట్టుకొని వ్యవసాయం చేయడమనేది ఎంతో ప్రయాసతో కూడుకున్నదని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన వర్సిటీ వీసీ డి. రాజిరెడ్డి అన్నారు. 

రాష్ట్రంలో వరి, పత్తి సాగు అధికంగా ఉందని.. ఉద్యాన పంటలు, కూరగాయలు, పౌల్ట్రీ, పశు సంవర్థకం వైపు విద్యను మళ్లించేందుకు తగిన ప్రణాళికలపై తమ వర్సిటీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఎరువులు, పురుగు మందుల వాడకం అధికమవడం దురదృష్టకరమని, కట్టడి చేయాలని  అవసరముందని తెలిపారు. 

ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్ ప్రిన్సిపుల్ క్లైమెట్ చేంజ్ స్పెషలిస్ట్ అంచా శ్రీనివాసన్ కీలకోపన్యాసం చేశారు. కాలేజీ పూర్వ విద్యార్థి కాన్సాస్ వర్సిటీ, యూఎస్‌ఏ డైరైక్టర్ పీవీ వరప్రసాద్ వజ్రోత్సవ ప్రసంగం చేశారు. ఆదిలాబాద్, అశ్వారావుపేట, రాజేంద్రనగర్ కాలేజీల  విద్యార్థులు ఆరు నవకల్పనల ప్రజెంటేషన్ ఇచ్చి ప్రశంసలు అందుకున్నారు. ఏజీ హబ్‌ సీఈవో విజయ్, వర్సిటీ మాజీ వీసీ ఎస్. రఘువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.