మల్లన్న ప్రసాదం దొర్కుతలే..నిరాశతో వెనుదిరుగుతున్న భక్తులు

  • భక్తుల రద్దీకి తగ్గట్లుగా ప్రసాదాల తయారీని పట్టించుకోని సిబ్బంది
  • వినియోగంలోకి రాని ప్రసాద తయారీ మెషీన్లు

సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న అనంతరం ప్రసాదం తీసుకుందామనుకునే భక్తులకు నిరాశే మిగులుతోంది. భక్తుల రద్దీకి తగ్గట్లుగా ప్రసాదాలను తయారు చేయడంతో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మల్లన్న ప్రసాదం కోసం క్యూలో నిలబడ్డ భక్తులకు లడ్డూ, పులిహోర దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. 

ప్రతి ఏడాది టెండర్లు

కొమురవెల్లి మల్లన్న దర్శనానికి ప్రతిరోజు రెండు వేలకు పైగా, వారాంతాల్లో అయితే పది నుంచి పదిహేను వేల మంది భక్తులు వస్తుంటారు. ఆలయంలో ప్రసాదాల తయారీ కోసం ప్రతి ఏటా ఆఫీసర్లు ప్రత్యేకంగా టెండర్లు నిర్వహిస్తారు. టెండర్లు పొందిన వ్యక్తులు ఏడాది పాటు భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసాదాలను తయారు చేయాలి. భక్తుల కోసం ప్రత్యేకంగా లడ్డూ, పులిహోర, రవ్వ కేసరిని తయారుచేస్తారు. కానీ రవ్వ కేసరి అమ్మకాలు కొంతకాలం కింద పూర్తిగా నిలిపివేసి లడ్డూ, పులిహోర మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు.

నిరుపయోగంగా మెషీన్లు

మల్లన్న దర్శనానికి వచ్చే భక్తుల రద్దీకి తగ్గట్లుగా ప్రసాదాలను తయారు చేసేందుకు ప్రత్యేకంగా యంత్రాలను కొనుగోలు చేశారు. లడ్డూ, పులిహోర తయారీ కోసం ఏడాది కింద రూ. 10 లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన మెషీన్లను ఇప్పటివరకు వినియోగంలోకి తీసుకురాలేదు. దీంతో లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన యంత్రాలు మూలన పడి ఉన్నాయి. 20 మంది కలిసి తయారు చేసే ప్రసాదాన్ని.. ఐదుగురు సిబ్బంది కలిసి మెషీన్ల ద్వారా ఈజీగా తయారు చేయొచ్చు. కానీ మెషీన్లను ఉపయోగంలోకి తీసుకొచ్చే విషయంపై ఆఫీసర్లు దృష్టి పెట్టడం లేదు.

ప్రసాద విక్రయ కేంద్రంలో పనిచేసే సిబ్బంది భక్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తులు కోరిన ప్రసాదాలకు బదులు అందుబాటులో ఉన్న వాటినే చేతిలో పెట్టి పంపిస్తున్నారని పలువురు భక్తులు వాపోతున్నారు. ముఖ్యంగా వారాంతాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటున్నా అందుకు తగ్గట్లుగా ప్రసాదాలను తయారు చేయడం లేదు. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు లడ్డూ ప్రసాదం కోసం విక్రయ కేంద్రానికి వెళ్తే ఖాళీ పెట్టెలే దర్శనమిస్తుండడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు.

ALSO READ : కొత్త మండలాల్లో.. కల్యాణలక్ష్మికి లాగిన్​ కష్టాలు

ఇతడి పేరు వెంకట్‌‌‌‌రెడ్డి. ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా మన్నెగూడ నుంచి కొమురవెల్లికి వచ్చాడు. మల్లన్న దర్శనం తర్వాత లడ్డూ కోసం ప్రసాద విక్రయ కేంద్రానికి వెళ్లాడు. అక్కడ ఎలాంటి ప్రసాదాలు లేకపోవడం, గంట సేపు వేచి ఉన్నా సమాధానం చెప్పే వారే లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో హడావుడిగా పులిహోర తయారు చేసి అతడి చేతిలో పెట్టి పంపించారు. లడ్డూ కోసం వస్తే పులిహోర చేతిలో పెట్టడంతో నిరాశగా వెనుదిరిగాడు.

రద్దీ కారణంగానే  ప్రసాదాల కొరత 

కొమురవెల్లిలో భక్తుల రద్దీ పెరగడం వల్ల అప్పుడప్పుడు ప్రసాదాల కొరత ఏర్పడుతోంది. భవిష్యత్‌‌‌‌లో ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రసాదాల పంపిణీలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. పులిహోర, లడ్డూ ప్రసాదాల తయారీ కోసం కొనుగోలు చేసిన యంత్రాలను వినియోగంలోకి తీసుకొస్తాం.

– బాలాజీ, ఈవో, కొమురవెల్లి