రైతులకు రుణమాఫీ పండుగ

  • కామారెడ్డి జిల్లాలో 4వ విడత రుణమాఫీ
  • 10, 157 మంది రైతులకు లబ్ధి
  • రూ.82.10 కోట్ల రుణమాఫీ ప్రకటన ​
  • జిల్లాలో ఇప్పటి వరకు 1,01,416 మందికి రూ.728 కోట్ల రుణమాఫీ 

తెలంగాణ ప్రభుత్వం రైతులకు దశలవారీగా రుణమాఫీ చేస్తోంది. తాజాగా నాలుగో విడత రుణమాఫీని ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో సర్కార్​ ప్రకటించింది.  నాలుగో విడతలో కామారెడ్డి జిల్లాలోని 10,157 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.  అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం వడ్లు అమ్మని రైతులకు కూడా బోనస్​ డబ్బులు జమచేస్తోంది. సన్న వడ్ల బోనస్ రూ.37.16 కోట్లు రైతుల ఖాతాల్లో​జమ చేసింది. 

కామారెడ్డి, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా  ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మహబూబ్ నగర్​జిల్లాలో రైతుపండుగను ప్రభుత్వం నిర్వహించింది. ఈ వేడుకల్లో రైతులకు ప్రభుత్వం గుడ్​న్యూస్​ చెప్పింది.  శనివారం నిర్వహించిన రైతు పండుగ సభలో మిగిలిన రైతులకు రుణమాఫీ ప్రకటించారు.   కామారెడ్డి జిల్లాలో 4 వ విడతలో  10,157 మంది రైతులకు రూ.82.10 కోట్ల  రుణమాఫీ జరగనుంది.  

ఇప్పటికే ప్రభుత్వం 3 విడతల్లో   91,259 మంది రైతులకు రూ. 646 కోట్ల 47 లక్షల రుణమాఫీ చేసింది.  తాజాగా 4వ విడతతో ప్రకటించిన రుణమాఫీతో జిల్లాలో మొత్తం రూ. 728 కోట్ల  57 లక్షల రుణమాఫీ జరిగింది. 1,01,416 మంది రైతులకు లబ్ధి చేకూరింది.   గతంలో  సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో పలువురు రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో రైతుల నుంచి నిరసన వ్యక్తమైంది.

జిల్లాలో తొలి విడతలో ( రూ. లక్ష వరకు )  49,54 మంది రైతులకు రూ. 231.13 కోట్లు,  రెండో  విడతలో ( రూ.1.50 లక్షలు)  24,816 మంది రైతులకు రూ. 211.72 కోట్లు,  మూడో విడతలో ( రూ.2 లక్షలు) 16,903 మంది రైతులకు రూ.  203.62 కోట్లు మాఫీ అయ్యాయి. రుణమాఫీ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.  తాజా ప్రకటనతో
జిల్లాలో  రూ.82 కోట్ల మాఫీ జరగనుంది. 

సన్న వడ్ల బోనస్ రూ. 37.16 కోట్లు

గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా రైతులకు సన్నరకం వడ్లు పండించిన రైతులకు  క్వింటాల్​కు రూ. 500 బోనస్​ ఇస్తోంది.  ఈ సీజన్లో ఇప్పటి జిల్లాలో  11,356 మంది రైతులకు రూ. 37 .16 కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయి.   ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో సన్నవడ్లను అమ్మిన రైతులకు కూడా బోనస్​ ఇస్తోంది. 

రైతు నేస్తం కోసం వీసీ సెంటర్ల ఏర్పాటు

రైతు నేస్తం పేరిట 25 మండలాల్లోని రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్​సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇందుకు రూ.  93.75 కోట్లు వెచ్చించారు.  వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల శాస్ర్తవేత్తలు రైతులకు  సాగు విషయాలు, సాంకేతిక సలహాలు అందిస్తున్నారు.  ఇప్పటి వరకు 34 దఫాలుగా ఈ కార్యక్రమాలు జరిగాయి.