2024 ఎన్నికల కోసం బీజేపీతో టీడీపీ, జనసేనల పొత్తు కుదిరిన తర్వాత జనసేనకు వరుస షాక్ లు తగులుతున్నాయి. ముందుగా కేటాయించిన 24 అసెంబ్లీ, 3ఎంపీ సీట్లలో కోత పడటమే కాకుండా సీటు ఆశించి భంగపడ్డ నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేనలో మరో కీలక నేత పోతిన మహేష్ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. విజయవాడ వెస్ట్ నుండి టికెట్ ఆశించిన ఆయన ఆ సీటు బీజేపీకి కేటాయించనున్నారని తెలియటంతో ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.
విజయవాడ వెస్ట్ స్థానానికి ముందు నుండి గట్టి పోటీ ఉంది. ఆ స్థానం కోసం టీడీపీలో జలీల్ ఖాన్, బుద్దా వెంకన్నపోటీ పడుతున్నారు. ఈ క్రమంలో పొత్తులో బీజేపీ వచ్చి చేరిన తర్వాత ఆ సీటు బీజేపీకి షిఫ్ట్ అయ్యింది. కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పోతిన మహేష్ కి సీటు ఇవ్వలేకపోయానని పవన్ స్వయంగా ప్రకటించటంతో మహేష్ పార్టీని వీడేందుకు రెడీ అయ్యాడు. అనుచరులు, కార్యకర్తలతో సమావేశం జరిపిన మహేష్ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యాడని సమాచారం.