బిజినెస్ డెస్క్, వెలుగు: రిస్క్ తీసుకోవద్దని అనుకునేవాళ్లు డబ్బును గవర్నమెంటు డెట్ స్కీముల్లో పెట్టడం బెటర్. ఇవి తక్కువ రిస్క్‌తో మెరుగైన రాబడి ఇస్తాయి. ఈక్విటీ మార్కెట్‌లో రిస్క్ ఎక్కువ కాబట్టి, ఇతర పెట్టుబడుల కంటే రాబడి కూడా ఎక్కువగా ఉంటుంది. రిస్క్ తీసుకోలేని వాళ్లకు స్టాక్స్ అనువైనవి కావు. రిస్కు లేకుండా మంచి రాబడి కావాలంటే పోస్టాఫీస్ స్కీములు ఉత్తమం. పోస్టాఫీస్ చిన్న పొదుపు పథకాలు మంచి రాబడిని ఇస్తాయి. రిస్క్ ఫ్యాక్టర్ కూడా తక్కువగా ఉంటుంది. వీటిలో పోస్టాఫీసు 'గ్రామ సురక్ష స్కీము' గురించి తప్పక తెలుసుకోవాలి. దీనిని రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీము అని కూడా అంటారు. పోస్టాఫీసు అందించే ఈ ప్రొటెక్షన్ ప్లాన్ తక్కువ రిస్క్‌తో మంచి రాబడిని పొందవచ్చు. ఈ స్కీములో చేరిన వారు ప్రతి నెలా రూ.1,500 డిపాజిట్ చేయాలి. ఈ మొత్తాన్ని క్రమం తప్పకుండా డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ తరువాత రూ. 31 లక్షల నుండి రూ.35 లక్షల వరకు పొందుతారు.
స్కీమ్ రూల్స్ ఇవి...
- 19 నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయులు ఎవరైనా ఈ స్కీములో పెట్టుబడి పెట్టవచ్చు.
- గ్రామసురక్ష స్కీము కింద కనీస హామీ మొత్తం (సమ్ ఎష్యూర్డ్) రూ. 10 వేల నుండి రూ. 10 లక్షల వరకు ఉంటుంది.
- ఈ ప్లాన్ ప్రీమియాన్ని నెలకు ఒకసారి, క్వార్టర్‌వారీగా, ఆరు నెలలకు ఓసారి లేదా ఏడాదికి ఒకసారి చెల్లించవచ్చు.
- ప్రీమియం చెల్లించడానికి 30 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది.
- ఈ స్కీము కోసం చెల్లించిన ప్రీమియం మొత్తం నుంచి కొంతశాతం వరకు లోన్ కూడా తీసుకోవచ్చు. కనీసం 48 నెలలు ప్రీమియం చెల్లిస్తేనే లోన్ ఇస్తారు.
- ఈ పథకంలో చేరిన మూడు సంవత్సరాల తర్వాత కూడా పాలసీని సరెండర్ చేయవచ్చు. ఇలా చేస్తే ఎలాంటి ప్రయోజనాలూ ఉండవని గుర్తుంచుకోవాలి.
- కనీసం 36 నెలలు ప్రీమియం చెల్లిస్తేనే పాలసీ సరెండర్‌కు అనుమతి ఇస్తారు.
- ఐటీ సెక్షన్ 80సి ప్రకారం ఈ పథకంలో పెట్టుబడిని పన్ను రాయితీ పొందడానికి వాడుకోవచ్చు.
రాబడి ఇలా...
- ఒక వ్యక్తి 19 సంవత్సరాల వయస్సులో ఈ స్కీములో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు అనుకుందాం. ఆయన రూ. 10 లక్షల పాలసీని కొని నెలవారీగా 55 సంవత్సరాల వరకు రూ. 1,515 చొప్పున కట్టాలి. 58 సంవత్సరాలకు అయితే రూ. 1,463 60 చొప్పున, 60 సంవత్సరాలకు అయితే రూ. 1,411 చొప్పున కట్టాలి.
- పాలసీహోల్డర్‌కు 55 సంవత్సరాలు వచ్చాక రూ. 31.60 లక్షలు వస్తాయి. 58 సంవత్సరాలకు రూ. 33.40 లక్షలు చేతికి అందుతాయి. 60 సంవత్సరాలకు అయితే రూ. 34.60 లక్షలు వస్తాయి. పాలసీహోల్డర్ మరణిస్తే నామినీకి డెత్ బెనిఫిట్ ఇస్తారు. బోనస్‌లూ ఉంటాయి.
