రుణమాఫీ సమస్యల పరిష్కారానికి పోర్టల్

  • టెక్నికల్ ​ఇబ్బందులతో కొందరు రైతుల లోన్ అకౌంట్లలో జమకాని నగదు
  • సమస్య పరిష్కారానికి కొత్త పోర్టల్ తేనున్న సర్కారు
  • పది రోజుల్లో అందుబాటులోకి ఏవోలకు లాగిన్​
  • అర్హులందరికీ రుణమాఫీ జరిగేలా సర్కారు చర్యలు​ 

మహబూబ్​నగర్, వెలుగు:  రుణమాఫీ అమలులో టెక్నికల్ సమస్యల వల్ల కొందరు రైతుల లోన్​అకౌంట్లలో డబ్బులు జమకాలేదు. దీంతో ఆందోళన చెందుతున్న బాధితులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లలో ప్రభుత్వం గ్రీవెన్స్​సెల్స్ ఏర్పాటు చేసింది. కానీ చాలా మందికి అవగాహన లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మండల అగ్రికల్చర్​ఆఫీసుల్లో సైతం దరఖాస్తులు తీసుకుంటున్నా వాటిని పరిష్కరించడం ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం కొత్త పోర్టల్​ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. 

ఏవోలకు లాగిన్​

రైతులు 2018 డిసెంబరు 12  నుంచి 2023 డిసెంబరు 9 వరకు రూ.2 లక్షల లోపు తీసుకున్న క్రాప్​లోన్లను మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ మేరకు గత నెల 17న రూ.లక్ష లోపు రుణాలను, 22న లక్షన్నర లోపు, ఈ నెల 15న రూ.2 లక్షలలోపు రుణాలను మాఫీ చేసేందుకు ఫండ్స్ విడుదల చేసింది. కానీ క్షేత్ర స్థాయిలో కొందరు రైతులకు లోన్లు మాఫీ కాలేదు. అర్హుల జాబితాలో వీరి పేర్లు ఉన్నా.. సాంకేతిక కారణాల వల్ల అకౌంట్లలో నగదు జమ కాలేదు. ప్రధానంగా రేషన్ కార్డులు లేకపోవడం, ఆధార్ కార్డు అకౌంట్లకు లింక్​ లేకపోవడం, ఆధార్​లో ఒక పేరు, అకౌంట్లలో మరో పేరు ఉండటం, పాస్ బుక్ నంబర్లు తప్పులుగా పడటంలాంటి సమస్యలు తెరపైకి వచ్చాయి. 

దీంతో వీటి పరిష్కారానికి రాష్ర్ట సర్కారు చర్యలు చేపట్టింది. ఇందుకోసం కొత్తగా పోర్టల్​తీసుకవస్తోంది. వారం, పది రోజుల్లో పోర్టల్ ను డెవలప్​ చేసి అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. మండలాల్లో ఉండే ఏవోలకు లాగిన్ బాధ్యతలు అప్పగించనుంది. వారికి శిక్షణ కోసం ఇప్పటికే కలెక్టర్లకు సర్కారు నుంచి ఆదేశాలు అందాయి.  

నెల రోజుల పాటు గ్రీవెన్స్

రుణమాఫీ కాని రైతుల నుంచి వినతులు స్వీకరించేందుకు రాష్ర్ట ప్రభుత్వంగ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకు గ్రీవెన్స్ సెల్స్​ఏర్పాటు చేసింది. గ్రామ స్థాయిలో ఏఈవోలు, మండల స్థాయిలో ఏవోలు, జిల్లా స్థాయిలో కలెక్టరేట్​లో లోన్లు మాఫీ కాని రైతుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ నెల రోజులపాటు కొనసాగనుంది. అనంతరం ఏవోలకు ఈ అప్లికేషన్లు అందించనున్నారు. వారు పోర్టల్​లో రైతుల వివరాలను అప్​డేట్ చేసి,రుణాలను క్లియర్ చేయనున్నారు.