హైడ్రాతో పేదలకు ఇబ్బందులు ఉండవ్

  • పెండింగ్ వెంచర్లకు అనుమతిలిస్తే ప్రభుత్వానికే ఆదాయం
  •  రియల్టర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. 
  •  క్యాలెండర్​ఆవిష్కరణలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

బషీర్ బాగ్, వెలుగు: హైడ్రాపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అయితే హైడ్రాతో పేదలకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని ఎమ్మెల్సీ ప్రొఫెసర్​కోదండరాం చెప్పారు. పెండింగ్ వెంచర్లకు అనుమతులు ఇస్తే.. ప్రభుత్వ ఖజానానే పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

మంగళవారం నాంపల్లిలోని టీజేఎస్​ఆఫీసులో తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ రూపొందించిన 2025 సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథిగా కోదండరాం పాల్గొన్నారు. దాదాపు 20 శాతం యువత ఉపాధి పొందుతున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, రియల్టర్ల సూచనలను ప్రభుత్వానికి నివేదిస్తానని ఆయన చెప్పారు. 

రియల్ ఎస్టేట్​రంగం సజీవంగా ఉండాలంటే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. హౌసింగ్ బోర్డు ద్వారా నూతన కాలనీలు ఏర్పాటు చేయాలని కోరారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. రియల్టర్లంతా అసోసియేషన్​లో సభ్యులుగా చేరాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడాల రంగారావు మాట్లాడుతూ 33 జిల్లాల కమిటీలు ఏర్పాటు చేసి అసోసియేషన్​ను బలోపేతం చేద్దామన్నారు. అసోసియేషన్​వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.నరసయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దిరాజు, శ్రీధర్, కార్యదర్శులు లక్ష్మణరావు, బొమ్మ వెంకటేశ్వర్లు, గ్రేటర్ ప్రాజెక్ట్స్ ఎండీ సయ్యద్ ఇమామ్, కరుణాకర్ పాల్గొన్నారు.