ప్రతి 500 మందిలో ఒక్కరికే టీకా

ప్రతి 500 మందిలో ఒక్కరికే టీకా

న్యూఢిల్లీ: మన దేశంలోని పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. పంజాబ్, మహారాష్ట్ర, ఢిల్లీల్లో వ్యాక్సిన్ నిల్వలు తక్కువగా ఉన్నాయని ఆ రాష్ట్రాల సీఎంలు చెప్పారు. ఈ నేపథ్యంలో అవసరాల మేర టీకా తయారీని మరింత వేగవంతం చేయాలని నిపుణులు చెబుతున్నారు. అయితే మన ఒక్క దేశమే కాదు దాదాపు 60 కంట్రీలు ఇదే  సమస్యను ఎదుర్కొంటున్నాయి. గ్లోబల్ ప్రోగ్రాం కింద వ్యాక్సిన్ డెలివరీలు ఆగిపోవడమే అందుకు కారణమని తెలుస్తోంది. ఇదిలాఉండగా.. ఈ కార్యక్రమం కింద గత రెండు వారాల్లో 92 దేశాలకు 2 మిలియన్ వ్యాక్సిన్ దోసులనే పంపగా.. ఒక్క బ్రిటన్ లోనే రెండు మిలియన్ల పైచిలుకు టీకా డోసులను ఇంజెక్ట్ చేయడం గమనార్హం. ఇదే సమయంలో భారత్ లో కరోనా కేసులు పెరగడం కూడా ఇతర దేశాల మీద ప్రభావం చూపుతోంది. మన దేశంలో తిరిగి కరోనా విజృంభిస్తుండటంతో సీరం ఇన్ స్టిట్యూట్ విదేశాలకు పంపే వ్యాక్సిన్ డోసుల ఎగుమతులను ఆపేయాలని కేంద్రం నిర్ణయించింది. కాగా, ధనిక దేశాల్లో ప్రతి నలుగురిలో ఒకరు టీకా తీసుకున్నారని, కానీ పేద దేశాల్లో మాత్రం ప్రతి 500 మందిలో ఒక్కరికి మాత్రమే వ్యాక్సిన్ అందిందని డబ్లూహెచ్ వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనాం గెబ్రియస్ చెప్పారు.