గీతాంజలి మరణంపై షర్మిల మౌనమెందుకు - పూనమ్ కౌర్

తెనాలి మహిళ గీతాంజలి మరణం ఏపీలో రాజకీయంగా దుమారం రేపుతోంది. టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు చేసిన ట్రోలింగ్ వల్లే గీతాంజలి మరణించిందని వైసీపీ ఆరోపిస్తుండగా, ఇది వైసీపీ ప్లాన్ అని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలను ఉద్దేశించి నటి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. గీతాంజలి మరణంపై షర్మిల మౌనంగా ఉండటం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ట్వీట్ చేసింది.

గీతాంజలి మరణం గురించి ఆ నేత ఎందుకు మౌనంగా ఉన్నారంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది."తోటి మహిళలు, చిన్నారుల పట్ల జాలి, దయ కలిగి ఉండటం మహిళా నేతల మొదటి, ముఖ్యమైన లక్షణం. గీతాంజలి అంశం మీద వైఎస్ షర్మిల మౌనంగా ఉండటం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. తెనాలిలోని సాధారణ మహిళలు, బాలికలు బయటకు వచ్చి పాఠాలు ఇలాంటి వారికి పాఠాలు నేర్పించాల్సిన అవసరం ఉందంటూ ట్వీట్ చేసింది పూనమ్.

గీతాంజలి కుటుంబానికి న్యాయం జరగాలంటే, ఆమె మరణానికి కారణమైన వారికి కఠిన శిక్ష పడాలని ట్వీట్ చేసింది పూనమ్. అమ్మాయిల మీద పుకార్లు పుట్టించి వేదించే వాళ్లకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరింది. గీతాంజలి విషయంలో ఏం జరిగింది, ఆమె మరణానికి గల కారణాలు వంటి అంశాల మీద దర్యాప్తు చేయాలని కోరింది పూనమ్ కౌర్.